Sep 29,2022 20:01
  • ఆర్‌జియుకెటి ట్రిపుల్‌ ఐటి ఫలితాల్లో జయభేరి
  • ఎంపికల్లో 76.97 శాతం వారే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్‌జియుకెటి)లోని ట్రిపుల్‌ ఐటి కోర్సుల ప్రవేశానికి సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో గురువారం ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని నాలుగు క్యాంపస్‌లలో 4,400 సీట్లకు గాను 44,208 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 4,400 సీట్లలో బాలికలు 2,721 మంది, బాలురు 1,399 మంది ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,171 (76.97 శాతం) మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి (23.03 శాతం) మంది ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన జల్లెల నందిని మయూరి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన బెహెర చక్రపాణి, గుంటూరు జిల్లా మున్నంగి ప్రభుత్వ పాఠశాలకు చెందిన సోమిశెట్టి ఫణీంద్ర రామకృష్ణ ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించి నూజివీడు క్యాంపస్‌లో సీట్లు పొందారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే టాప్‌-20లో నిలిచారు. సీట్లు సాధించిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు 106 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 19 మంది ఉన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితా షషష.తీస్త్రబస్‌.ఱఅలో పొందుపరిచారు.
కొత్త క్యాంపస్‌ ఆలోచన లేదు : మంత్రి బొత్స
కొత్తగా ట్రిపుల్‌ ఐటి క్యాంపస్‌లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతం ఉన్న వాటినే అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒంగోలులో అద్దె ప్రతిపాదికన కొనసాగుతున్న క్యాంపస్‌ను కనిగిరికి తరలించి మూడేళ్లలో శాశ్వత భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఈ ఏడాది శ్రీకాకుళం క్యాంపస్‌లో కూడా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఆర్‌జియుకెటి క్యాంపస్‌లలో చదివిన విద్యార్థులకు 93 శాతం ప్లేస్‌మెంట్లు వచ్చాయని యూనివర్సిటీ కులపతి కెసి రెడ్డి చెప్పారు. తమ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. అక్టోబరు 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని యూనివర్సిటీ ఉపకులపతి కె హేమచంద్రారెడ్డి వెల్లడించారు. అక్టోబరు 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్లు, కాల్‌ లెటర్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జివిఆర్‌ శ్రీనివాసరావు, బి జయరామిరెడ్డి, పి జగదీశ్వర్‌రావు, అడ్మిషన్ల కన్వీనరు ఎస్‌ఎస్‌ఎస్‌వి గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.