Jan 31,2023 07:44

               ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్వాకాలతో రైతుకు కంటి మీద కునుకు కరువైంది. ఈ మారైనా వరి పంటకు కనీస ధర దక్కుతుందని ఆశ పడ్డ అన్నదాతలకు సవాలక్ష ప్రతిబంధకాలు చుట్టుముట్టి వారి ఆశలను ఆవిరి చేశాయి. ఖరీఫ్‌లో ప్రకృతి కాస్తంత అనుకూలించడంతో రైతులు ఒక మేరకు వరి పంట సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక అమ్మబోతే అన్నీ అడ్డంకులే. వచ్చినకాడికి అమ్ముకొని బయట పడటమే మహా యజ్ఞం అన్నట్లు తయారైంది రైతు పరిస్థితి. ప్రభుత్వం మాత్రం రైతు పండించిన ప్రతి గింజకూ 'మద్దతు' ఇప్పించి తీరతామని గుక్కతిప్పుకోకుండా ఆర్భాటపు ప్రకటనలు చేసింది. ఆచరణలో అందుకు ఎంతమాత్రం పొసగని విరుద్ధ చర్యలు చేపట్టింది. ఇది ప్రభుత్వ రైతు వ్యతిరేకతను తెలుపుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి నిబద్ధత లేదనడానికి లక్ష్యాల నిర్ణయమే ఒక ఉదాహరణ. ఖరీఫ్‌లో 67 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసి, 37 లక్షల టన్నులు సేకరించాలని టార్గెట్‌ పెట్టుకుంది. నిరుడు 40 లక్షల టన్నుల లక్ష్యం తీసుకొని ఈ ఏట ఎందుకు తగ్గించారో జవాబు లేదు. ఉత్పత్తిని బట్టి సేకరణ లక్ష్యాలు నిర్ణయమవుతాయన్నది సర్కారు ఉవాచ. ముందటేడు సేకరణ లక్ష్యం 45 లక్షల టన్నులు. అంతకు ముందు సంవత్సర టార్గెట్‌ 45 లక్షల టన్నులే. క్రమేణ ప్రభుత్వం ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తోందని ధ్రువపడుతుంది.
         లక్ష్యాలే ఇంత సొంపుగా ఉంటే ఇక వాస్తవ సేకరణ ఇంకెలా ఉంటుందో ఊహించవచ్చు. ధాన్యం ఉత్పత్తి అంచనాలూ ఒక పట్టాన లేవు. ప్రభుత్వ రెండవ ముందస్తు ఎస్టిమేషన్‌లో ధాన్యం ఉత్పత్తి 76 లక్షల టన్నులకు పెరిగింది. ఉత్పత్తి పెరిగినప్పుడు ప్రభుత్వ సేకరణ పెరగాలి. రైతులను సర్కారు వారి మానాన వారిని గాలికొదిలేసింది. కొంటామన్న దానికీ ఎన్నో కొర్రీలు. రైతు భరోసా కేంద్రాలే (ఆర్‌బికె) ధాన్యం కొనుగోలు కేంద్రాలని, మిల్లర్ల ప్రమేయం లేదని పేర్కొంది. అంతలోనే రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని సడలించింది. ఈ మార్పు మిల్లర్లకు అనుకూలం తప్ప రైతులకు కాదు. రవాణా, హమాలీ ఛార్జీలు, గోనె సంచులు ఇస్తామనగా ఎక్కడా అమలు లేదు. ఎకరాకు సగటున 30 బస్తాలే కొంటామని పరిమితి విధించింది. అంతకంటే ఎక్కువ పండిన పంటను రైతు ఎవరికి అమ్ముకోవాలి? 'ఎ' గ్రేడ్‌లో ఉన్న కొన్ని వరి రకాలను కామన్‌ వెరైటీ జాబితాలో చేర్చడంతో రైతులు ధర నష్టపోతున్నారు. ఇ-క్రాప్‌, ఇ-కెవైసి షరతులు సరేసరి. ఇవి కౌలు రైతులను రాచి రంపాన పెడుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గడప ఎక్కనీకుండా అడ్డుకుంటున్నాయి. అన్ని గండాలనూ దాటుకొన్నా ధాన్యం అమ్మేది మళ్లీ మిల్లర్లకే. తేమ, తూకం, నాణ్యత పేరుతో దోపిడీ చెప్పనలవి కాదు. అంతా చేసి సొమ్ము ఎప్పుడు అకౌంట్‌లో పడుతుందో స్పష్టత ఇవ్వరు. ఈ బాధలు పడలేకనే రైతులు తెగనమ్ముకొని నష్టపోతున్నారు.
       సమస్యలను పరిష్కరించి రైతుకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం మొత్తానికే ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తుండటం గోరుచుట్టుపై రోకలి పోటు చందం. ఇప్పటికి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 29 లక్షల టన్నులు. పెట్టుకున్న లక్ష్యం చేరాలంటే ఇంకా 8 లక్షల టన్నులు సేకరించాలి. మార్చి వరకు ఖరీఫ్‌ ధాన్యం కొనాలి. జనవరి నుంచే కేంద్రాలు మూసివేస్తున్నారు. టార్గెట్ల భర్తీ కోసం, డిమాండ్‌నుబట్టి, రైతులు ఒత్తిడి చేసిన చోట, మండలాల వారీగా కొన్ని రోజులు, అదీ పరిమితంగా కొనుగోళ్లకు పర్మిషన్‌ ఇస్తున్నారు. డిసెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ధాన్యం తడిచి రంగు మారింది. కేంద్రంతో మాట్లాడి నాణ్యతా ప్రమాణాల్లో మార్పు చేసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది లేదు. పంట పండించిన రైతుకు ధర ఇప్పించటం ప్రభుత్వ బాధ్యత. అందుకు అన్ని చర్యలూ చేపట్టాలి. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎఫ్‌సిఐ, పిడిఎస్‌లను నిర్వీర్యం చేస్తూ ఆహార ధాన్యాల సేకరణకు కోతలు పెడుతోంది. రాష్ట్ర ప్రజల, రైతుల ప్రయోజనార్ధం బిజెపి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఘటించాలి.