Jun 22,2022 18:41

వయసు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఎందరికో ఆమె గొప్ప స్ఫూర్తి. ఈ వయసులో ఇంత ప్రయాస అవసరమా? అనుకునేవారికి గొప్ప ఆదర్శం. 105 ఏళ్ల వయసులో వంద మీటర్ల దూరాన్ని 45.40 సెకన్ల వ్యవధిలో అవలీలగా అధిగమించేసి ఔరా అనిపించిన ఈ బామ్మ పేరు రమా బాయి. హర్యానా చర్ఖి దాద్రి జిల్లా కడ్మా గ్రామవాసి. ఇటీవల బెంగుళూరులో జరిగిన నేషనల్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రమాబాయి స్వర్ణ పతకం అందుకున్నారు. 85 ఏళ్ల పైబడిన వారికి నిర్వహించిన 100 మీటర్ల పరుగుపందెంలో రమాబాయి ఒక్కరే పాల్గన్నా... ఎవరూ ఊహించని నిర్ణీత సమయంలో లక్ష్యం చేరుకుని ఔరా అనిపించారు. (పోటీలో పాల్గనేందుకు ఎవరూ ముందుకు రాలేదు).

పరుగు పందెంలో పతకాలు సాధించడం బామ్మకేమీ కొత్తకాదు. వంద, రెండొందల మీటర్ల పరుగు పందెం, లాంగ్‌ జంప్‌ వంటి వివిధ క్రీడల్లో ఇప్పటికే నాలుగు బంగారు పతకాలు సాధించారు. ఆ గ్రామంలోకే పెద్దదైన బామ్మను 'ఉదాన్‌పారీ పడాడి (గ్రేట్‌ గ్రాండ్‌ మదర్‌)' అని ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూ కనిపించే బామ్మ పొలం పనులు కూడా చకచకా చేసేస్తుంది. రోజుకు 5 నుంచి 6 కిలోమీటర్లు పరుగెత్తుతూ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు తీసిపోని శిక్షణ చేస్తోంది. ఉదయం 4 గంటలకే ఆమె దినచర్య మొదలవుతుందని పొలంలోనే పరుగులు పెడుతూ శిక్షణ తీసుకుంటుందని ఆ గ్రామస్తులు అంటున్నారు.

బామ్మ ఒక్కత్తే కాదు, తన కుటుంబంలో 62 ఏళ్ల కూతురు సంత్రాదేవి, 70 ఏళ్ల కొడుకు ముఖ్త్యార్‌ సింగ్‌ కూడా వివిధ క్రీడాపోటీల్లో    పాల్గొంటూ   బంగారు, వెండి పతకాలు సాధిస్తున్నారు. కుటుంబంలో ఒక్కరో, ఇద్దరు కాదు మొత్తం సభ్యులు, ముఖ్యంగా తల్లి, కూతురు, కొడుకు క్రీడాకారులుగా రాణించడం గొప్ప విషయమే కదూ...!