Nov 23,2022 10:47
  • కీలక రంగాల్లో వెనుకబాటు
  • ఎన్నికల్లో చర్చనీయాంశం

న్యూఢిల్లీ : గుజరాత్‌ అభివృద్ధి గురించి బిజెపి నేతలు చెప్పే మాటలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గుజరాత్‌ మోడల్‌ అంటూ ఆ పార్టీ నేతలు ఊదరగొడుతుండగా, మరోవైపు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ రాష్ట్ర శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. బిజెపి నేతలు చెబుతున్న సమాచారం ప్రకారం పారిశ్రామికంగా గుజరాత్‌ ఎంతో అభివృద్ధి చెందింది. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలను సైతం గుజరాత్‌కు తరలిస్తున్నారు. అయితే, ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, రెండోవైపు అభివృద్ధికి కీలకమైన అనేక రంగాల్లో ఆ రాష్ట్రానిది వెనుకబాటే! ముఖ్యంగా పసిపిల్లల్లో పౌష్టికాహార కొరత, రక్తహీనత వంటి అంశాల్లో ఆ రాష్ట్రం వెనుకబడే ఉంది.. దీంతో బిజెపి నాయకులు చెబుతున్న అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయన్న ప్రశ్న ముందుకువస్తోంది.
 

                                                         సర్కారుకు పట్టని చిన్నారులు...

భావి భారతానికి అత్యంత కీలకమైన చిన్నారుల ఆరోగ్యం విషయంలో గుజరాత్‌ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి నేషనల్‌ ఫ్యామిలీ అండ్‌ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5) తాజా గణాంకాలే నిదర్శనం. 2019-20వ సంవత్సరానికి సంబంధించిన ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. దీని ప్రకారం వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు, తక్కువ బరువు ఉన్న చిన్నారులు దేశ సగటుతో పోలిస్తే గుజరాత్‌లోనే ఎక్కువ. ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల్లో 39శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. దేశ వ్యాప్తంగా ఈ విభాగంలో 35.5 శాతమే ఉన్నారు. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు గుజరాత్‌లో 25.శాతం ఉండగా, దేశ సగటు 19.3శాతమే! వయసుకు తగిన బరువులేని చిన్నారులు 39.7శాతం మంది ఉన్నారు. 6నుండి 23 నెలలలోపు చిన్నారుల్లో 5.9శాతం మందికి మాత్రమే గుజరాత్‌లో పౌష్టికాహారం అందుతోంది. దేశ వ్యాప్తంగా ఈ సగటు 11.3శాతం ఉంది. దేశ వ్యాప్తంగానే చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించిన గణాంకాలు ఆందోళనగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు సాధిస్తుండగా, గుజరాత్‌ మాత్రం దానికి భిన్నంగా తక్కువ పనితీరు చూపుతున్న రాష్ట్రాలతో పోటో పడుతుండటం విశేషం.
 

                                                            కలవరపరుస్తున్న రక్తహీనత

అభివృద్ధికి మరో కొలబద్దయైన రక్తహానతను అదుపుచేసే అంశంలోనూ గుజరాత్‌ పనితీరు ఆందోళనకరంగానే ఉంది. దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు 67శాతం మంది రక్తహానతతో బాధపడుతుండగా, గుజరాత్‌లో ఈ సంఖ్య ఏకంగా 80శాతానికి కొంచెం తక్కువ! ఇంత భారీ సంఖ్యలో చిన్నారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను ప్రస్తావించడానికి, పరిష్కారం చూపడానికి పధానమంత్రి నరేంద్రమోడీగానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌గాని సిద్ధంగా లేకపోవడం గమనార్హం. 63శాతం గర్బిణీలు, 49 సంవత్సరాల లోపు మహిళలు 65శాతం మంది రక్తహీనతను ఎదర్కుంటున్నారు. నీతి అయోగ్‌ వెబ్‌సైట్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ సర్వే ప్రకారం అహ్మదాబాద్‌, సూరత్‌,వడోదర, దాహోడ్‌, బనస్కాంత జిల్లాల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. పారిశ్రామీకీకరణ అధికంగా జరిగిన నగరాలతో పాటు పేద, గిరిజన ప్రజానీకం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ పౌష్టికాహారం, రక్తహీనత సమస్యలుండటం గమనార్హం.