Sep 19,2022 08:25

ప్రపంచ భాషల్లో ఏ రచయితకైనా ఒక సామాజిక స్వప్నముంటుంది. సామాజిక స్వప్నమంటే ఆ రచయిత దష్టిలో సమాజం ఎలా ఉండాలి అన్న భావనే. ఏ సామాజిక స్వప్నమూ లేకుండా ఏ రచయితా ఏమీ రాయరు, రాయలేరు. సామాజిక స్వప్నాలు రచయితలకు తమ సమకాలీన జీవితానుభవంలోంచే రూపుదిద్దుకుంటాయి. ఆయా రచయితల సామాజిక చైతన్యాన్ని బట్టి, సామాజిక స్వప్నాలుంటాయి. ఉత్తమమైన సామాజిక స్వాప్నికుల్లో ఆధునిక తెలుగు రచయితల్లో గురజాడ అప్పారావు ప్రముఖులు. ఆయన సామాజిక స్వప్నం ఇది.

ఎల్లలోకము వొక్కయిల్లై - వర్ణ భేదములెల్ల కల్లై
వేలనెరుగని ప్రేమబంధము - వేడుకలు కురియ
మతములన్నియు మాసిపోవును - జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును
అంత స్వర్గ సుఖంబులన్నవి - అవని విలసిల్లున్‌

(ముత్యాల సరములు - ఆంధ్ర భారతి, జులై 1910)
గురజాడ అప్పారావు ఈ స్వప్నాన్ని ప్రకటించి సరిగ్గా నూట రెండు సంవత్సరాలైంది. కానీ ఆయన కోరుకున్న మంచి సమాజం ఇంకా కలగానే మిగిలి ఉంది. అందువల్ల ఆ స్వప్నం ఇంకా ప్రాసంగికత కలిగి ఉంది. గురజాడ తన స్వప్నం సాకారం కావడానికి అడ్డంగా ఉన్న సకల సామాజికాంశాలనూ విమర్శకు పెట్టారు. ఆ క్రమంలో కొన్ని అద్భుతమైన, అర్థవంతమైన వాక్యాలను మనకందించి పోయారు. ఆ వాక్యాలను వ్యాఖ్యానించుకుందాం.

1. మగడు వేల్పన పాతమాటది
ప్రాణమిత్రుడ నీకు (కాసులు : ఆంధ్రభారతి 1910 ఆగష్టు)
స్త్రీ పురుషుల మధ్య సంబంధాల్లో విప్లవాత్మకమైన మార్పులను ప్రతిపాదించారు గురజాడ. భార్యాభర్తల మధ్య యజమాని- బానిస సంబంధాలను తిరస్కరించి స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకున్నారు. భర్త భార్యకు దేవుడనే భూస్వామ్య భావనను తిరస్కరించి, భార్యకు ప్రాణస్నేహితునిలాగా ఉండాలని కోరుకున్నారు. భూస్వామ్య వ్యవస్థలో నష్టపోయిన స్త్రీలే ఈ మార్పును తీసుకురావాలని ఆయన భావించారు. అందుకే ఆధునిక మహిళ మానవ చరిత్రను తిరిగి రచిస్తుంది (21.05.1909న ఒంగోలు మునిసుబ్రహ్మంకు రాసిన లేఖ) అన్నారు. భూస్వామ్య స్త్రీ పురుష సంబంధాలను, భూస్వామ్య కుటుంబ వ్యవస్థను గురజాడ తీవ్రమైన విమర్శకు పెట్టారు. ఆ వ్యవస్థ మీద, ఆ సంబంధాల మీద స్త్రీ పాత్రలతో తిరుగుబాటు చేయించారు. కన్యాశుల్కం నాటకంలో నన్నడక్కుండా సుబ్బికి పెళ్ళెందుకు నిశ్చయించావు అని వెంకమ్మ అగ్నిహోత్రావధానిని నిలదీసింది. తనను మోసగిస్తున్న గిరీశంను కొట్టడానికి పూటకూళ్ళమ్మ చీపురు తీసుకొని మధురవాణి ఇంటికి వెళ్ళింది. తనకు జరిగిన అన్యాయం తన చెల్లెలికి జరక్కూడదని బుచ్చమ్మ గిరీశంతో వెళ్ళిపోయింది. తనను అనుభవించి, తాను చెడిపోయిందని ప్రచారం చేస్తున్న రామప్పంతులును తనను పెళ్ళాడమని చెరువు కట్టదాకా తరుముతుంది మీనాక్షి. అవిధేయ భర్త అయిన కరటక శాస్త్రికి, అతని భార్య, అతనికి ఇష్టం లేని దొండకాయకూర వండిపెట్టి నిరసన ప్రకటిస్తుంది. ఈ కరటకశాస్త్రే 'మా యిళ్ళాళ్ళకు కోపం వస్తే చీపురు కట్టలు ఎగురుతుంటాయి' అంటాడు. 'దిద్దుబాటు' కథానికలో కమలిని దారి తప్పుతున్న భర్తను బెదిరింపు లేఖ రాసిపెట్టి సంస్కరించుకుంటుంది. ఈ ఉదాహరణలన్నీ భూస్వామ్య కుటుంబ సంబంధాల మీద తిరుగుబాట్లే. భూస్వామ్య కుటుంబ సంబంధాలను తిరస్కరించిన గురజాడ పెట్టుబడిదారీ కుటుంబ సంబంధాలను కూడా సమర్థించలేదు. కన్యాశుల్కం నాటకంలోనే మధురవాణి అంటుంది. ''ఇదే నేను కాపు కన్నెనై పుట్టి ఉంటే, నా అన్నవాళ్ళు ఉండేవారు. భర్తతోపాటు పొలంలో పనిచేస్తూ గౌరవంగా బతికేదానిని'' అని. భార్యాభర్తలిద్దరూ పనిచేస్తూ పరస్పరం గౌరవించుకుంటూ బతకాలన్నది మధురవాణి ప్రతిపాదన. గురజాడ 'సౌదామిని' అనే నవల రాయడానికి రాసిపెట్టుకున్న నోట్సులో భారతదేశంలో ప్రతి స్త్రీ ఒక వంటలక్కగా ఉండిపోయిందనీ, దీనివల్ల చాలా శ్రమ వథా అవుతున్నదనీ, అందువల్ల గ్రామంలో సార్వజనీన భోజనశాలలు ఉండాలనీ, అందరూ అక్కడ తిని, పోయి వత్తులలో పాల్గొనాలనీ అందులో ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే గురజాడ భార్యాభర్తల మధ్య ధనప్రమేయంలేని, ఆధిపత్యంలేని సంబంధాలు నెలకొనాలన్నారు. ''మగడు వేల్పన పాత మాటది'' అంటే భూస్వామ్య స్త్రీ పురుష సంబంధాలు నిర్మూలింపబడాలని, ''ప్రాణసఖుడ నీకు'' అని భర్తతోనే చెప్పించారు గురజాడ. భార్యాభర్తలు ప్రాణస్నేహితులుగా ఉండాలన్న ఆకాంక్ష 1910 నాటికి అత్యాశే. అనేక ఉద్యమాలు స్త్రీ పట్ల, అందులో భార్యలపట్ల మొగవాళ్ళ దష్టిని మార్చాయి. గురజాడ కల ఫలిస్తున్నది. గురజాడ కవిత్వంలో ఇదొక మహా వాక్యం.

2. బ్రతికి చచ్చియు ప్రజల కెవ్వడు ప్రీతిగూర్చునొ - వాడె ధన్యుడు
(డామన్‌ పితియస్‌ : ఆంధ్రభారతి, 1910 సెప్టెంబర్‌)
గురజాడ కుటుంబ సంబంధాల్లోనే కాదు, మొత్తం మానవ సంబంధాల్లోనే స్నేహసంబంధాలు ఉండాలని కోరుకున్నారు. అనేక కారణాల చేత విభజితమై ఉన్న సమాజంలో మనుషుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడలేదు. వివక్ష, ఆధిపత్యం, అసమానత్వం - వీటి మూలంగా మానవుల మధ్య ఉండవలసిన సహజ సంబంధాలు కృత్రిమంగా మారిపోయాయి. గురజాడ ప్రజలు స్నేహితులుగా బతకాలని కోరుకున్నారు. అందుకే గ్రీకు సాహిత్యంలోంచి డామన్‌, పితియస్‌ అనే ఇద్దరు స్నేహితుల కథను తీసుకొచ్చి అదే పేరుతో కవిత రాశారు. ఇది ఒకరి కోసం ఇంకొకరు ప్రాణమివ్వడానికి సిద్ధపడిన ఇద్దరు స్నేహితుల కథ. మనిషి బతికున్నా, మరణించినా ప్రజలకు మేలుచేయాలి, ప్రీతిని కలిగించాలి, అప్పుడు అతని జన్మధన్యం అంటుంది ఈ కవిత. భారత స్వాతంత్య్ర సంగ్రామం వలస పాలకుల బెంగాల్‌ విభజన విఫలమై వందేమాతరం విజయవంతమై సహాయ నిరాకరణోద్యమం వైపు పరుగుతీస్తున్న సమయంలో ఈ కవిత రాశారు గురజాడ. ఇది ఇద్దరు స్నేహితుల వైయక్తిక సంబంధాన్ని చెబుతున్నట్లు ఉన్నా, త్యాగం అనే విలువను ప్రతిపాదిస్తోంది. దేశ స్వాతంత్య్రం కోసం నాయకులు, ప్రజలు త్యాగాలకు పూనుకుంటున్న సమయంలో ఈ కవిత వ్యక్తి త్యాగాన్ని కీర్తించింది. క్రమక్రమంగా స్వార్థం బలిసిపోతున్న వ్యవస్థలో ఉన్న మనం గురజాడ ప్రబోధాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకు కర్తవ్యం బోధపడుతుంది. గురజాడ కవిత్వంలో ఇది ఇంకో మహా వాక్యం.
 

3. వర్ణ ధర్మ మధర్మ ధర్మంబే
కులవ్యవస్థ భారతీయ సమాజానికి చేసిన నష్టం విలువ కట్టడం సాధ్యం కాదు. ప్రజల్ని వేలకు వేలు కులాలుగా విభజించడం వల్ల సాంఘిక ఐక్యత దెబ్బతిని, భారత జాతి బలహీనపడింది. ఈ కుల వ్యవస్థను శాశ్వతం చెయ్యడానికి వైవ, కర్మ, జన్మ సిద్ధాంతాలు సష్టించి జాతిని నిర్వీర్యం చేశారు మన పూర్వీకులు. ఈ కారణంగానే భారతదేశం అనాదిగా పరాయిపాలనలో మగ్గిపోయింది. ఈ కుల వ్యవస్థను నిర్మూలించడానికి భారతదేశంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. వర్ణవాదుల బలం ముందు ఆ ప్రయత్నాలు విఫలమౌతూ వస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటించమని శాస్త్రజ్ఞులు చెబితే, చూశారా మా సిద్ధాంతమే నేడు ప్రపంచానికి ఆదర్శమైంది అని ఒక కవి పుంగవుడు పద్యం రాసి రాగం తీశాడు. అంటే వర్ణ సర్పం ఏ సమయంలోనైనా పడగవిప్పి కరవడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇలాంటి సమయంలో ఒక బాధ్యతగల కవి నూట పదేళ్ళ క్రితం వర్ణ ధర్మాన్ని అధర్మ ధర్మం అని తీర్పునిచ్చాడు. ఇది మరో గొప్ప మహావాక్యం. దళితుడు ఎదురైనప్పుడు ఆలింగనం చేసుకోనివాడు మనిషెలా అవుతాడు? అన్నాడు గురజాడ ఒకచోట. 1910 నాటికి ఇది విప్లవమే. ''కవీ ప్రవక్తా కాలం కన్నా ముందుంటారు'' అన్న గురజాడ మాటకు ఆయనే ప్రథమోదాహరణం. మానవ సమాజం మానవీయ సమాజంగా మారాలంటే కులం అనే అడ్డుగోడను పగులగొట్టవలసిందే. మానవాత్మలో కాంతివంతమైన పువ్వు ప్రేమ అని రాసుకున్నారు గురజాడ. గురజాడ ప్రతిపాదించిన ప్రేమ ఊహాత్మక ప్రేమ కాదు. ఆచరణీయమైన ప్రేమ. అందుకే ఆయన గౌతమబుద్ధుని, ఏసు క్రీస్తును, షెల్లీ కవిని స్మరించుకున్నారు. బుద్ధుడు, బోధించిన ప్రేమ సజీవమైన ప్రేమ అన్నాడు. అంతేకాదు, ఏ రోజు బౌద్ధాన్ని దేశం ఎల్లలు దాటించామో ఆ రోజే మన దేశం మత విషయకంగా ఆత్మహత్య చేసుకుంది అనడానికి కూడా గురజాడ వెనుకాడలేదు. ఈ మహావాక్యాన్ని ప్రతి గ్రామం ప్రవేశద్వారంలోనూ అధికారికంగా రాసిపెట్టి ప్రచారం చేయాలి. గౌతమబుద్ధుని విగ్రహాలకు పూలమాలలు వేస్తూ, ఉద్యానవనాలు నిర్మిస్తూ, అంబేద్కర్‌ విగ్రహాల మీద దాడులు చేసే కుటిల నీతికి గురజాడ వాక్యాలే విరుగుడు.

4. ఎరిగి కోరిన కరిగి యీడో ముక్తి
(మనిషి : 1919 డిసెంబర్‌ 14, కృష్ణాపత్రిక)
సమాజాన్ని ఒక వ్యవస్థనుండి మరొక వ్యవస్థలోకి తీసుకుపోవాలంటే - అంటే పాత వ్యవస్థను నిర్మూలించి, కొత్త వ్యవస్థను నిర్మించాలంటే, భావవాదం ఏమాత్రం ఉపయోగపడదు. దానికి భౌతికవాదమే శక్తివంతమైన ఆయుధం. భావవాదులుగా ఉంటూ సమాజాన్ని కొంత మరమ్మతు చేయవచ్చేమోగానీ, పూర్తిగా మార్చలేం. పూర్తిగా మార్చాలంటే భౌతికవాదమే శరణ్యం. భౌతికవాదమంటే మానవాతీత శక్తులను నమ్మకపోవడం. మనిషిని చరిత్ర నిర్మాతగా గుర్తించడం. గురజాడ 'మనిషి' కవిత ఈ వాస్తవాన్నే ప్రబోధిస్తున్నది. మన సమాజంలో ఆర్థిక సాంఘిక వైరుధ్యాలుండడానికి కారణం మనుషులే. మనుషులు నిర్మించుకొన్న వ్యవస్థే. వైరుధ్యాల సమాజ నిర్మాణం చేసింది మనుషులే అయినట్లు, దాని నిర్మూలన కూడా మనుషులే చెయ్యాలి. ఈ వాస్తవాన్ని విగ్రహారాధనను ఆధారం చేసుకొని గురజాడ మనిషికి ముక్తినిచ్చేది దేవుళ్ళు కాదు మనుషులే అని చెప్పాడు. 'ముక్తి' అంటే సమస్యలకు పరిష్కారం. విగ్రహాలను మనిషి చెక్కుతున్నాడు. ఆ విగ్రహానికి మహిమ ఉందని పూజిస్తూ, ఆ విగ్రహాన్ని చెక్కిన ఆ మనిషిని రాయిరప్పలకన్నా హీనంగా ఎందుకు చూస్తారు? అని ప్రశ్నించారు గురజాడ. ప్రతి మనిషికి ఇంకొక మనిషి పట్ల గల బాధ్యతను కూడా గుర్తుచేశారు. అందుకే ఈ వాక్యం గురజాడ కవిత్వంలో మరో మహావాక్యం. ''మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలగును'' అన్న గురజాడ మాట ఇవాళ తలకిందులైంది. దానిని నిటారుగా నిలబెట్టినప్పుడే భూమి స్వర్గంగా మారుతుంది.

5. దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా

(దేశభక్తి : కృష్ణాపత్రిక 1913 ఆగష్టు 9)
1910లో గురజాడ కోకిల పాడిన కమ్మని పాట 'దేశభక్తి' కవిత. ఈ కవితకు ఆయన 'దేశాభిమానం' అని పేరుపెట్టారు. కందుకూరి కూడా 'దేశాభిమానం' పేరుతో వ్యాసాలు రాశారు. ఇది అప్పటి భారతీయులకు తెలుగు కవి ఇచ్చిన పిలుపు. ఇది ఒక కొత్త పిలుపు. ''సుజలాం సుఫలాం మలయజ శీతలాం'' అనే దేశభక్తికి భిన్నంగా దేశమంటే మనుషులు అని కొత్త అర్థం చెప్పిన కవిత ఇది. ఇప్పటికీ దేశభక్తి చర్చనీయాంశంగా ఉంది. మనుషుల్ని కులం పేరిట, మతం పేరిట, ఆహారం పేరిట ఇంకా సవాలక్ష మౌఢ్యాల పేరిట హింసిస్తూ దేశభక్తుల ముసుగులో తిరగడం కొనసాగుతున్నది. అసలైన దేశభక్తి మనుషులను ప్రేమించడంలో ఉందని ఈ పంతులు చెప్పిన పాఠం ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. అందుకే ఈ మహావాక్యానికి ఇంకా ప్రాసంగికత ఉంది. మనుషుల్ని ప్రేమించడం, మానవ శ్రమతో దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం, స్వయం సమద్ధిని సాధించడం, కులమత మౌఢ్యాల నుంచి విముక్తమై దేశ ప్రజలంతా ఒక తల్లీబిడ్డలుగా బతకడం గురజాడ దృష్టిలో దేశభక్తి. వెనక చూపును ఆమోదించలేదు గురజాడ.

దేశ మనియెడి దొడ్డవక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయి

ప్రజల మధ్య ద్వేషాగ్నులను రగిల్చే వాళ్ళకు ఈ మాట చాలు. మనుషుల మధ్య ప్రేమను పాదు చేయడమే గురజాడ ప్రబోధించిన దేశాభిమానం. మానవ ప్రేమ పునాదిగా కులమతాల ప్రసక్తిలేని లౌకిక భారతదేశం ఆవిర్భవించేదాకా, జ్ఞానమయమైన సమాజం రూపొందేదాకా గురజాడ మహా వాక్యాలకు ప్రాసంగికత ఉంటుంది. భారతీయ లౌకిక, భౌతిక, ప్రజాతంత్రవాదులందరూ గురజాడను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి.
(ఈనెల 21న గురజాడ జయంతి)

- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి