Nov 21,2022 07:59

విజయనగరంలో వున్న సాహిత్య, సాంస్క ృతిక సంస్థలన్నీ కలిసి 'గురజాడ సమాఖ్య' పేరుతో ఒక సంస్థగా ఏర్పడ్డాయి. గత కొన్నేళ్లుగా ఆ సమాఖ్య గురజాడ పేరిట ఒక వార్షిక అవార్డును ఎంపికచేసిన వారికి నవంబరు 30వ తేదీన ప్రదానం చేస్తోంది. కొన్ని పోటీలు పెట్టి విజేతలకు బహుమతులు కూడా ఇస్తోంది. గురజాడ సాహిత్యంపై సభ కూడా జరుపుతున్నారు. అందుకు వారు అభినందనీయులు. అయితే, నగరంలోని అన్ని సంస్థలకూ ప్రాతినిధ్యం ఉందని మాట వరుసకు అన్నా- మిగతా సంస్థలను సంప్రదించరు. ఆ సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోరు. నలుగురైదుగురి ఏకపక్ష నిర్ణయాలతోనే సమాఖ్య నడుస్తుంది. అయినా పెద్దగా ఆక్షేపణ లేదు. ఆక్షేపణీయం ఏమిటంటే గురజాడ పేరు మీద ఇస్తున్న అవార్డు ఎవరికి ఇస్తున్నారు అన్న దాని మీదే !
       ఈ ఏడాది ఈ అవార్డును ప్రవచనకర్త చాగంటి కోటీశ్వరరావు గారికి ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయం సెప్టెంబరులోనే జరిగింది. అది సరైన నిర్ణయం కాదు. గురజాడ ముందుచూపు ఉన్న వాడు. ప్రగతిశీలవాది, భౌతికవాది, ఆచరణవాది. చాగంటి వారు అందుకు పూర్తిగా భిన్నమైన దృక్పథం, ఆచరణ కల ప్రవచనకర్త. పురస్కార ప్రకటనకు మేము అభ్యంతరం చెబితే- 'మేము గురజాడ అభ్యుదయ అవార్డు అని ఇవ్వడం లేదు. అయినా గురజాడను వేలాదిమందికి తెలిసేలా చేస్తున్నాం. ఇది మంచిదా లేక చాలా తక్కుమందిలో జరపడం మంచిదా' అన్న వాదన తెస్తున్నారు, సమాఖ్య వారు.
     గురజాడ ఒక్క విజయనగరానికే పరిమితమైన వారు కాదు. ప్రపంచ తెలుగు ప్రజలకు మహాకవి. కోట్లాదిమంది తెలుగు ప్రజలు ఆయన భావాలను ఏ దేశం వారికైనా వారి అభివృద్ధికి మార్గమని భావిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో సాహితీ, సాంఘిక చైతన్యాన్ని రగిలిస్తున్నారు. అందులో భాగంగా ఆయన సాహిత్యాన్ని పరిశోధించి ప్రచురించి ప్రజలకు చేరేటట్లు చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రగతిశీల వాదులు, అభ్యుదయవాదులు. గురజాడ భావాలను ప్రజలకు చేర్చి తన్మూలంగా సమాజ ప్రగతి కాంక్షిస్తున్నారు. ప్రతిఏటా వందలాది సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా లక్షలాది మందికి గురజాడ ప్రగతిశీల భావజాలం చేరుతుంది.
            అంతెందుకు? విజయనగరంలో నూరేళ్ల కన్యాశుల్కం సందర్భంగా ఒక ఏడాది పాటు ప్రతినెలా సభలూ, సమావేశాలు నిర్వహించి తెలుగు రాష్ట్ర నలుమూలల నుంచి సాహితీవేత్తలను ఆహ్వానించి ఆ సభల్లో మాట్లాడించలేదా? ఆ సందర్భంగా కన్యాశుల్యం పూర్తి నాటకం (9 గంటలు) ప్రదర్శించినది అభ్యుదయ సంస్థలు కాదా? గురజాడ శత వర్ధంతి సందర్భంగా దేశభక్తి గీతాన్ని లక్ష కాపీలు ముద్రించి అన్ని స్కూళ్లకు చేర్చి పిల్లలతో ఆ గీతాన్ని ఆలపించడానికి ప్రోత్సహించలేదా? శత వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో వేలాదిమందితో ఊరేగింపు, సభ జరపలేదా? 2014, 2017లలో వైజాగ్‌ ఫెస్ట్‌ సందర్భంగా 200 పైగా ప్రచురణ సంస్థలతో బుక్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పరచి ఆ ప్రాంగణంలో 'గురజాడ' సాహిత్య వేదికపై నుంచి పదేసి రోజులపాటు సాహిత్యసభలు, కవి గాయక సమ్మేళనాలు నిర్వహించలేదా? ఈ సంగతులు వారి దృష్టిలో లేవా? లేక విస్మరించారా? ఇప్పటి సమస్య ఎవరు ఎంత చేశారు అన్నది కాదు. గురజాడ భావజాలం ఏమిటి, వారి పేరు మీద పురస్కారం ఎవరికి ఇస్తున్నారనేది ప్రస్తావన.
'మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటె రాయి రప్పల కన్న కనిష్టం
గాను చూస్తా లేలా బేలా?
దేవుడెకడో దాగెనంటూ/ కొండకోనల వెతుకులాడే వేలా?
కన్ను తెరచిన కనబడడో?
మనిషి మాత్రుడి యందు లోడో?
యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి' అన్నారు గురజాడ.

దేవుడిని మనిషే సృష్టించాడు కాబట్టి లేని దేవుడి కోసం కొండ కోనలు వెతక వద్దు. నీకు నీతోటి మనిషి మాత్రమే సహాయ పడగలడు కావున ఆసత్యాన్ని గ్రహించి మనిషిని ప్రేమించమన్నాడు ఆయన.
'మగడు తేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు/
నీనెనరు/ కలుగక యున్న పేదను కలిగినను
నా పదవి వేల్పుల రేని కెక్కడీ' అని జీవిత భాగస్వామిని ప్రాణమిత్రుడిగా పరిగణించారు. 'ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది' అని చెప్పారు. 'మలిన దేహుల మాలలనుచును/ మలిన చిత్తుల కధిక కులముల/ నెల నొసంగిన వర్ణధర్మ మధర్మ ధర్మంబే' అని ఈ వర్ణ వ్యవస్థ అధర్మము అని చాటి చెప్పారు. 'కన్ను కానని వస్తుతత్వము/ కొంచ నేర్చరు వింగి రీజులు/ కల్లనొల్లరు వారి విద్యల/ కరచి సత్యము నరసితిన్‌', 'దూర బంధువు భూమికి/ దారి బోవుచు చూడవచ్చెను/ డెబ్బ దెనుబడి యేండ్ల కొక తరి/ నరుల కన్నుల పండువై/ తలతు నేనిది సంఘ సంస్కరణ/ ప్రయాణ పతాక గాన్‌' అన్నారు.

తోకచుక్క కనిపించిన సందర్భంగా సాంప్రదాయవాదులు ఇది అరిష్టానికి సూచన అని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినపుడు 'భయపడాల్సిన అవసరం లేదు. తోకచుక్క రాకను సంఘ సంస్కరణోధ్యమానికి పతాకగా తలుస్తాను' అని చెప్పారు గురజాడ. ఈ సత్యాన్ని నేను ఇంగ్లీషు వారి వస్తుతత్వ భౌతికవాద ఆలోచనల విద్య నుంచి గ్రహించానని చెప్పారు. 'మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును/ అంత స్వర్గ సుఖంబులన్నవి/ యవని విలసిల్లున్‌'. శాస్త్రజ్ఞానం పెరిగిన కొలది మత ప్రభావం తగ్గి చివరికి మతాలు కనుమరుగౌతాయి.. జ్ఞానం మాత్రమే మరింత జ్ఞానాన్ని సంపాదించి కొనసాగుతుంది' అని చెప్పారు. జ్ఞానవంతుల సమాజమేర్పడడం ద్వారానే ఊహిస్తున్న స్వర్గ సుఖాలు ఈ భూమి పైనే సాకారమౌతాయి అని నొక్కి వక్కానించారు. 'అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నియు మెలగవలెనోరు' అని ప్రబోధించారు. 'వెనుక చూసిన కార్యమేమోయి/ మంచి గతమున కొంచమేనోయి/ మందగించక ముందుకడుగేరు/ వెనుక బడితే వెనుక నేనోరు' అన్నాడు.
            అలాంటి దూరదృష్టి గల గురజాడ భావాలకు విరుద్ధమైన భావాలను ప్రచారం చేస్తూ ప్రవచనాలు చెబుతున్నారు చాగంటి కోటేశ్వరరావు గారు. ఆయన ప్రవచనాల్లో ఎక్కువ భాగం అసత్యాలు లేక అర్ధసత్యాలు. స్త్రీల విషయంలో మనువాద భావాలను ప్రచారం చేస్తున్నారు. అవే గొప్ప విషయాలుగా భావించేట్లు ఉద్బోధిస్తారు. వర్ణ వ్యవస్థ కొనసాగాలని చెబుతారు. నెమలి స్కలించకుండానే సంతానోత్పత్తి చేస్తుందని అసత్యాలు ప్రచారం చేస్తారు. ఆయన ప్రసంగాలన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి. ఎవరైనా పరిశీలించవచ్చు. అన్ని విషయాలపైనా అభ్యంతరం చెప్పడం మా ఉద్ధేశం కాదు. ఆయనని అభిమానించేవాళ్లు, అనుసరించేవారు, ఆయన చెప్పిన విషయాలను నమ్మేవారు ఉండొచ్చు. అది వారి ఇష్టం. వారితో పేచీ లేదు. వారి అభిప్రాయాలను, ఇష్టాలను గౌరవిస్తాం.
          అభ్యంతరమల్లా పై అన్ని విషయాల ప్రాతిపదికన గురజాడ పురస్కారాన్ని చాగంటి వారికి ఇవ్వడంపైన. గురజాడ పురస్కారం చాగంటి వారికి ఇవ్వడం అసమంజసం అన్నది మా భావన. అభ్యంతరాలను లెక్క చేయకుండా సమాఖ్య వారు తాము తీసుకున్న అహేతుకమైన నిర్ణయంతో ముందుకు పోతున్నారు. ఈ దశలో ఆలోచించినపుడు గురజాడ ఆనాడు వాడుక భాష విషయమై తన 'అసమ్మతి పత్రాన్ని' ఇచ్చినట్టు- మనం కూడా మన అసమ్మతి తెలియచేయడం ఉత్తమమని అనిపించింది. గురజాడను అభిమానించే వ్యక్తులను, సంస్థలను ఈ పురస్కారం చాగంటి వారికి అందచేయడానికి నిరసనగా మీ అసమ్మితి ప్రకటించమని కోరుతున్నాము. మీ అసమ్మతిని ఏ ప్రక్రియలో అయినా తెలియచేయవచ్చు. వ్యాసం, గల్పిక, ప్రహసనం, కవిత, పద్యం, గేయం, చిన్నకధ ఇంకేదైనా మీకు నచ్చిన విధంగా ఉండవచ్చు. అందరి అసమ్మతి పత్రాలను విజయనగరంలో నిరసన కార్యక్రమంలో గురజాడ విగ్రహానికి సమర్పిస్తాము. మీ అసమ్మతి పత్రాలను ఈ కింది నెంబరుకు వాట్సప్‌ గాని ఇమెయిల్‌ ద్వారా గాని 25.11.2022లోగా లోగా పంపించండి. అదే సమయంలో మీ మీ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రకటించండి. 'పూను స్పర్ధను విద్యలందే/ వైరములు వాణిజ్యమందే' అని గురజాడే చెప్పారు. ఇది కలహం కాదు, వైరం అంత కంటే కాదు. గురజాడ సమాఖ్యను నిర్వహిస్తున్న పెద్దలతోగాని, చాగంటి వారితో గాని వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకతా లేదు. ఈ సందర్భంగా ఈ విషయం పట్ల మాత్రమే భిన్నాభిప్రాయం ఉందని అర్ధం చేసుకోవలసినదిగా మనవి. వాట్సాప్‌ నెం: 94411 76882

ఇట్లు
సాహితీ స్రవంతి, అరసం,
ప్రజాసాహితి, శ్రీకాకుళ సాహితి,
స్నేహకళాసాహితి, వెలుగు,
రాజాం రచయితల సంఘం,
సహజ సాహిత్య, సాంస్క ృతిక సంస్థలు;
ఇంకా గురజాడను అభిమానించేవారు,
అనుసరించేవారు.