Nov 30,2022 07:23

  • నేడు గురజాడ వర్థంతి

గురజాడ భావజాలంతో ఏకీభావం లేనివాళ్ళు ఆయన పేరుతో సంస్థను స్థాపించడం, ఆయన భావజాలంతో ఏకీభావం లేని వాళ్ళకు పురస్కారాలివ్వడం విడ్డూరం. ఒక సాహిత్య సంస్థను పెట్టుకునే హక్కు, ఆ సంస్థ ద్వారా తాము అర్హులని భావించిన వారికి పురస్కారాలిచ్చే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే ఆ హక్కును ఉపయోగించుకొనేవాళ్ళు ఏ రచయిత పేరుతో తాము సంస్థను పెట్టుకున్నారో, ఆ రచయితను అవమానించే విధంగా కార్యక్రమాలు చేయడం మంచిదికాదు. ఇది ఆ రచయిత భావజాలానికీ, ఆ రచయిత ఉద్యమానికీ ద్రోహం చేయడమే అవుతుంది. ఇది క్షమించరాని తప్పు. ఈ తప్పుకు పాల్పడడం మంచిదికాదు. పైగా ప్రశ్నించిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఇంకా తప్పు.

గురజాడ అప్పారావు గారు 1862లో పుట్టి 1915లో మరణించారు. 53 ఏళ్ళు బతికారు. అనేక వ్యాపకాల నడుమ అనారోగ్యంతో సహజీవనం చేస్తూ 1600 పుటలు రచనలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాలు రచనా జీవితం గడిపారు. ఆయన సాహిత్యం కొందరికి ఖేదం, కొందరికి మోదం కలిగించింది. ఖేదం పొందినవారు గురజాడ కవే కాదనీ, అకవి అనీ తూలనాడారు. అంతేకాదు ఆయన కన్యాశుల్కం నాటకం రాయనేలేదనేశారు. ఇంకా కన్యాశుల్కం నాటకమే కాదనేశారు. నిండు చెరువులో నీళ్ళ లేవు అనడమంటే ఇదే. ఇది గురజాడ వలన ఖేదం పొందినవాళ్ళలో మొదటి తరం వారి లీలలు. రెండో తరం వాళ్ళు గురజాడ సంస్కృతీ విధ్వంసకుడనీ, ఆయన పిరికివాడనీ, ఆయన సాహిత్యంలో దేశభక్తే లేదనీ హీనంగా మాట్లాడారు. అయ్యో పాపం అన్నవాడిని పాపిష్టి వాడా అని తిట్టినట్లు ''దేశమును ప్రేమించుమన్నా'' అన్నరచయితను దేశభక్తుడు కాదని నిరసించారు మన సహృదయ శిఖామణులు. సరే వాళ్ళంతా సంప్రదాయ వాదులు, గురజాడ ఆధునికత వాళ్ళకు నచ్చలేదు గనుక, వాళ్ళు ఆయనను ఈసడించారు అనుకుందాం. ప్రజాదృక్పథం గలవాళ్ళు కూడా కొందరు ఆయనను ఆయన కులం దృష్టితోనే చూచి అందులో బిగించే ప్రయత్నం చేశారు. ఆయనేమో బ్రాహ్మణ్యం ఎంత పతనం అయిందో చూపించారు. వర్ణ ధర్మం అధర్మ ధర్మం అని తీర్పునిచ్చిన రచయితను ఆయన కులంలో బిగించడం న్యాయమేనా? రాజుకూ దళిత అమ్మాయికీ ప్రేమ పెళ్ళి జరిపించిన రచయితను ఆయన కులం చట్రంలో బిగించడం ఉచితమేనా? ఆయన సాహిత్యం వల్ల మోదం పొందినవారు గురజాడను అక్కున చేర్చుకున్నారు. ఆయనను తమకు తాత్విక మూలపురుషునిగా చేసుకున్నారు. గురజాడను శాస్త్రీయంగా విశ్లేషిస్తూ, ప్రజారచయితగా ప్రచారం చేస్తూ, ఆయన సాహిత్యం వల్ల ఖేదం పొందినవాళ్ళను పూర్వపక్షం చేస్తున్నారు. ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధం దాదాపు నూరేళ్ళుగా సాగుతున్నది.
              ఈ యుద్ధం ఇలా సాగుతుండగా ఇప్పుడు గురజాడకు మరో సమస్య వచ్చి పడింది. అదేమంటే నీ వేలితో నీ కళ్ళనే పొడుస్తాం అనే వర్గం, ఎగిరే పేల పిండిని కృష్ణార్పణం అనే వర్గం ఒకటి అవతరించింది. గురజాడ భావజాలంతో ఏమీ సయోధ్య లేని వర్గం ఒకటి ఆయన పేరుతో ఒక సంస్థను స్థాపించి, ఆయన భావజాలంతో ఏ కోశానా ఏకీభవించని వాళ్ళకు పురస్కారాలివ్వడం మొదలుపెట్టింది. ఇది ఈ శతాబ్దపు తలకిందులు అద్భుతం. సాధారణంగా మనకు నచ్చని భావజాలంగల రచయిత మన ఊరివాడైనా, మన కులం వాడైనా, మన మతం వాడైనా, మన ప్రాంతం వాడైనా మనం అతనిని దూరం పెడతాం. దగ్గరికి రానీయం. గురజాడ వ్యతిరేకులు రెండు తరాల వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళ ఆలోచనలు తిరోగమనమైనవైనా వాళ్ళు నిజాయితీపరులు. వాళ్ళతో ఏకీభవించని వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఆమోదిస్తారు. కానీ గురజాడ భావజాలంతో ఏకీభావం లేనివాళ్ళు ఆయన పేరుతో సంస్థను స్థాపించడం, ఆయన భావజాలంతో ఏకీభావం లేని వాళ్ళకు పురస్కారాలివ్వడం విడ్డూరం. ఒక సాహిత్య సంస్థను పెట్టుకునే హక్కు, ఆ సంస్థ ద్వారా తాము అర్హులని భావించిన వారికి పురస్కారాలిచ్చే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే ఆ హక్కును ఉపయోగించుకొనేవాళ్ళు ఏ రచయిత పేరుతో తాము సంస్థను పెట్టుకున్నారో, ఆ రచయితను అవమానించే విధంగా కార్యక్రమాలు చేయడం మంచిదికాదు. ఇది ఆ రచయిత భావజాలానికీ, ఆ రచయిత ఉద్యమానికీ ద్రోహం చేయడమే అవుతుంది. ఇది క్షమించరాని తప్పు. ఈ తప్పుకు పాల్పడడం మంచిదికాదు. పైగా ప్రశ్నించిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఇంకా తప్పు.
          గురజాడ పేరుతో ఒక సంస్థ పెట్టాలన్నా, ఆ సంస్థతో గౌరవం పొందాలన్నా గురజాడ రచనా తత్వంతో మనం ఏకీభవించగలగాలి. గురజాడ రచనా తత్వం ఏమిటి? ఆయన సాహిత్యంలో ఆయన ఏయే ప్రతిపాదనలు చేశారు? ఆయన సామాజిక స్వప్నం ఏమిటి? ఆయన విమర్శించిన సామాజికాంశాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి.
              గురజాడ ఆధునిక సమాజ స్వాప్నికుడు. ప్రవచనకారులు రకరకాల వ్యాఖ్యానాలతో ప్రచారం చేసే పురాణాలేవీ ఆధునిక సమాజాన్ని కోరుకోవు. అవి మధ్యయుగ సమాజాన్ని వైభవీకరించాయి. అవి ప్రచారం చేసింది రాచరిక, భూస్వామ్య సమాజం. వర్ణాధిక్య పురుషాధిక్య సమాజం. మత సమాజం. గురజాడ కోరుకున్నది ప్రజాస్వామ్య సమాజం. మత రహిత, వర్ణరహిత సమాజం. స్త్రీపురుష సమానత్వ సమాజం. పురాణం పాలకవర్గం వైపు నిలబడుతుంది. అవి చెప్పే కథలు, బోధించే నీతులు ప్రజలను దేవునికీ, రాజుకూ విధేయులుగా మార్చేది. రాజును చరిత్ర నిర్మాతగా పురాణాలు ప్రచారం చేస్తాయి. గురజాడ మనిషే చరిత్ర నిర్మాత అని చెప్పారు. మనిషి కష్టసుఖాలకు మనిషే కారణమని చెప్పాడు. కొండకోనల్లో దేవుని వెతకడం కన్నా ఎదురుగా కనిపించే మనిషిని నమ్మమంటారు. ఇలాంటి తేడాలు పురాణాలకూ, గురజాడకు మధ్య ఉన్నాయి. అందువల్ల పురాణ ప్రవచనకారులకూ గురజాడకూ పొందిక కుదరదు. గురజాడ తొలి దశలోనో, తర్వాత సందర్భానుసారంగానో కొన్ని భావవాద మాటలు ఉపయోగించినా అవి ఆయన చివరి భావజాలానికి ప్రాతినిధ్యం వహించవు. రీవారాణి 1907లో ఊటీ మీద పాటలు రాయమంటే గురజాడ 'నీలగిరి పాటలు' పేరుతో ఆరు పాటలు రాశారు. కన్యాశుల్కం నాటకంలో సౌజన్యారావు పంతులు మధురవాణికి భగవద్గీతను బహూకరించాడు. పూర్ణమ్మ దుర్గలో కలిసిపోయినట్లు చెప్పారు. అందువల్ల గురజాడ భౌతికవాది కాడు, భక్తుడు, మా వాడే అని చంకలు గుద్దుకోవడం ఆత్మానందమేగానీ శాస్త్రీయమైన వాదం కాదు.
           'మనిషి కవిత రాసిన గురజాడ పురాణ ప్రవచనకారుల పాలిటి సింహం కదా! అందువల్ల గురజాడ బొమ్మను ఉపయోగించుకొని ఆయన భావజాల విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం ఏమాత్రం గౌరవనీయమైన పని కాదు. వర్ణ ధర్మాలను ప్రచారం చేసిన పురాణాలకూ, ''వర్ణ ధర్మ మధర్మ ధర్మంబే'' అన్న గురజాడకూ ఎక్కడ పొత్తు? గురజాడ పేరుతో సంస్థను స్థాపించిన వాళ్ళు గానీ, ఆ సంస్థ ఇచ్చే గౌరవం పొందేవాళ్ళు గానీ విజయనగరం లోని గురజాడ ఇంటి ముందు నిలబడి ''వర్ణ ధర్మ మధర్మ ధర్మంబే'' అని నినదించగలరా? ''మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును'' అని విజయనగరంలో ఒక ఎత్తైన కోట మీదినుంచి ప్రకటించగలరా? ''మగడు వేల్పన పాత మాటది ప్రాణసఖుడ నేను'' అనే మాటను విజయనగరంలోని మహిళలను సమావేశపరిచి ప్రకటించగలరా ?
           'వెన్‌ బుద్ధిజమ్‌ వజ్‌ స్టాంప్డ్‌ అవుట్‌, ఇండియా కమిటెడ్‌ రెలిజియస్‌ సూసైడ్‌' అనే గురజాడ అభిప్రాయాన్ని విజయనగరం జిల్లాలో ఏదైనా బుద్ధక్షేత్రం ఉంటే అక్కడ కరపత్రంగా పంచిపెట్టగలరా? ''దళితుడు ఎదురైతే ఆలింగనం చేసుకోని వాడు మనిషెలా అవుతాడు?'' అన్న ప్రశ్నను ఆధిపత్య కులాల నివాస ప్రాంతాలలో ప్రచారం చేయగలరా ?
               పొరకచుక్క ప్రమాదకారి కాదు. 'సంఘసంస్కరణ ప్రయాణ పతాక', 'దూరపు బంధువు' అనే నిర్వచనాలను జ్యోతిష్కుల ఇళ్ళ ముందు ప్రకటించగలరా? ఊరికే చెలామణి ఉందిగదాని గురజాడ పేరు పెట్టుకొని సంస్థను నెలకొల్పడం, దాని ద్వారా గురజాడ భావజాలానికి భిన్నమైన భావజాలం గలవాళ్ళను గౌరవించడం ఎవరికీ గౌరవం కాదు. గురజాడకు అవమానకరమైన పనులు చేయకండి దయచేసి. ఆ సంస్థకు వేరే పేరు పెట్టుకోండి.
         గురజాడ వెన్నెల విహారి కాడు. నిప్పు కణం మీద సంచారి. గురజాడ విదూషకుడు కాదు. విజ్ఞుడు. గురజాడ యథాతథ వాది కాడు. మార్పు వాది. గురజాడ కాలక్షేపం వాది కాడు. కర్కశమైన వాస్తవిక వాది. ఆయన పేరు మీద ఒక సంస్థను పెట్టాలన్నా, ఆ సంస్థ గౌరవం స్వీకరించాలన్నా ''అన్నీ వేదాల్లో వున్నాయష'' అనే అధిక్షేపాన్ని ఆమోదించే నిజాయితీ, ధైర్యం కావాలి.

(వ్యాసకర్త ప్రజాశక్తి బుకహేౌస్‌ గౌరవ సంపాదకులు)
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి