Aug 02,2022 06:56

కేంద్ర సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌)కు మోడీ ప్రభుత్వం 'గొప్ప'గా ప్రకటించిన రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజి 'హళ్లికి హళ్లి సున్నకు సున్న' అన్న సామెతకు బాగా నప్పుతుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవల మెరుగుదల, 4జి స్పెక్ట్రం కేటాయింపు, బ్యాలెన్స్‌షీట్‌పై ఒత్తిడి తగ్గించడం, ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం బిఎస్‌ఎన్‌ఎల్‌లో భారత్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిబిఎన్‌ఎల్‌) విలీన చర్యలు ప్యాకేజీలో ఉంటాయన్నారు. నగదు రూపేణా రూ.43 వేల కోట్లు, ఇతర రూపాల్లో రూ.1.2 లక్షల కోట్లు వచ్చే నాలుగేళ్లల్లో అందిస్తామంటున్నారు. ప్యాకేజీని ఆసాంతం ఆకళింపు చేసుకున్నట్లయితే తన విధానాలతో కొడిగడుతున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి లవలేశమాత్రమైనా ప్రభుత్వంలో కనిపించదు. ఇంతకుముందు 2019 అక్టోబర్‌లో రూ.74 వేల కోట్ల మేర తొలి ప్యాకేజి ప్రకటించారు. అందులోని పలు కార్యక్రమాలు నేటికీ కాగితాలపైనే ఉన్నాయి. అలాంటప్పుడు మరోమారు ప్రకటించిన ప్యాకేజీ ఆచరణరూపం దాల్చుతుందనుకోవడం భ్రమే. తొలి ప్యాకేజీలో చేసిందల్లా 80 వేల ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ.
     బిఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసిందనడానికి సాక్ష్యాలు కోకొల్లలు. మొదటి ప్యాకేజీలో 4జి కోసం రూ.23 వేల కోట్లిస్తామన్నారు. 4జి సేవల విస్తరణకు ప్రభుత్వమే మోకాలడ్డింది. సంస్థకు ఉన్న 50 వేల బిటిఎస్‌ల ఆధునీకరణ చేయగలిగితే రెండేళ్ల క్రితమే 4జి సేవలు ప్రారంభించగలిగేది. ఒక వైపు ప్రైవేటు కంపెనీలు అంతర్జాతీయ వెండర్ల వద్ద 4జి పరికరాలు సమకూర్చుకుంటుండగా బిఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వలేదు. దేశీయంగానేనని మెలిక పెట్టింది. తీరా వేసిన టెండర్లనూ రద్దు చేసుకోమని తానే ఒత్తిడి తెచ్చింది. ప్రకృతిలో ఉచితంగా లభించే స్పెక్ట్రంను బిఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగించుకోకుండా అడ్డుకుంది. కాగా 2016లోనే ప్రైవేటు ఆపరేటర్లు 4జి సేవల్లోకి చొచ్చుకెళ్లి ఏకపక్షంగా లాభాలు మూటగట్టుకుంటున్నారు. 4జిపై మోడీ ప్రభుత్వ ప్రకటనలు ఎంత బూటకమంటే తొలి ప్యాకేజీలో రూ.23 వేల కోట్లు, ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో రూ.44 వేల కోట్లు, తాజాగా రెండో ప్యాకేజీలో రూ.44 వేల కోట్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కలుపుకుంటే రూ.1.12 లక్షల కోట్లవుతాయి. ఏమీ ఇవ్వకుండా అంతా ఇంతా అనడం బిజెపి సర్కారుకే చెల్లింది. ప్రైవేటు కంపెనీలు 5జి సేవలకు సన్నద్ధమయ్యాయి, స్పెక్ట్రం వేలం సైతం ముగిసింది. ముఖేష్‌ అంబానీకి చెందిన జియో పెద్ద బిడ్డర్‌గా నిలిచింది. అదానీ, ఎయిర్‌టెల్‌, వొడా, ఐడియా కూడా 5జిని దక్కించుకున్నాయి. ఈ పరిస్థితుల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జి సేవలనడానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వం-కార్పొరేట్లకు మధ్య గట్టిగా పెనవేసుకున్న లాలూచీ బంధమే.
     ప్యాకేజీలో మరెన్నో సిత్రాలున్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థిక పునరుద్ధరణకు పెట్టుబడి వ్యయం రూ.22 వేల కోట్లిస్తామన్నారు. కానీ ప్రభుత్వమే రూ.38 వేల కోట్లు సంస్థకు చెల్లించాలి. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌, ఉద్యోగుల పెన్షన్‌ కంట్రిబ్యూషన్‌ కింద అదనపు వసూళ్లు వంటి బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. బకాయిలతో పోల్చితే ప్యాకేజీలోని మూలధనం చాలా తక్కువ. రూ.40 వేల కోట్ల రుణాల సేకరణకు అనుమతించినా వడ్డీతో సహా సంస్థే చెల్లించాలి. ఒకప్పుడు ప్రభుత్వం కింద ఒక వెలుగు వెలిగి దేశ ప్రజలను ఒకటి చేసిన టెలికం డిపార్టుమెంట్‌ నయా-ఉదారవాద విధానాలొచ్చాక వాజ్‌పేయి హయాంలో బిఎస్‌ఎన్‌ఎల్‌గా అవతరించింది. అప్పటి నుంచే సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. టెలికంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించాక బిఎస్‌ఎన్‌ఎల్‌ బలహీనపడుతూ వచ్చింది. ప్రైవేటు పోటీని తట్టుకోవాలంటే సమాన అవకాశాలు కల్పించాల్సి ఉండగా యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాలు కావాలనే ఆ పని చేయలేదు. దాంతో దేశంలో 110 కోట్ల మొబైల్‌ వినియోగదారులుంటే బిఎస్‌ఎన్‌ఎల్‌ వాటా 12 కోట్లు మాత్రమే. ఒకప్పుడు సంస్థలో ఉద్యోగుల సంఖ్య 1.65 లక్షలు కాగా ప్రస్తుతం 64 వేలు. ప్రభుత్వరంగ ఆస్తులను ప్రైవేటుకు చుట్టచుట్టి ధారాదత్తం చేసేందుకు మానిటైజేషన్‌ వంటి పథకాలను తెస్తున్న మోడీ సర్కార్‌, టెలికం రంగం ప్రైవేటు దోపిడీకి వాటంగా ఉండగా బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఆదుకుంటుందని అనుకోగలమా?