May 26,2023 09:02

         అమ్మకు ఏదైనా పని చేసుకోవడం కష్టంగా ఉందనుకోండి.. మీలో ఎంతమంది పిల్లలు అమ్మ పనులకు సాయం చేస్తారు. ఆ జాబితాలో చాలా తక్కువ మందే ఉంటారు. అయితే మీరంతా ఒక్కసారి 14 ఏళ్ల ప్రణవ్‌ గురించి తప్పక తెలుసుకోవాలి. ప్రతి రోజూ నీళ్ళ కోసం అమ్మ పడే కష్టం చూస్తున్న ప్రణవ్‌ అమ్మ బాధ తీర్చాలని ఏకంగా బావినే తవ్వేశాడు. ప్రణవ్‌ గురించి ఇంకా తెలుసుకోవాలనుందా.. అయితే చదవండి..
           ప్రణవ్‌ అమ్మానాన్నతో కలిసి ముంబయికి 128 కిలోమీటర్ల దూరంలోని పాల్‌ఘర్‌ జిల్లా ధావనగపడ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. నలుగురు తోబుట్టువుల్లో చిన్నవాడు. 9వ తరగతి చదువుతున్నాడు. నూతన ఆవిష్కరణలు చేయడమంటే ప్రణవ్‌కు భలే సరదా. మొన్నీమధ్యే సోలార్‌ ప్యానెల్స్‌ను మోటారుబైక్‌తో అనుసంధానించి ఇంటిలో విద్యుత్‌ బల్బులు వెలిగించాడు. ఇప్పుడేమో ఓ పార, గునపం, చిన్న నిచ్చెన తీసుకుని ఏకంగా ఇంటి ముందు నుయ్యి తవ్వేశాడు. 'రోజంతా భూమిని తవ్వుతూనే ఉండేవాడు. భోజన విరామానికి కేవలం 15 నిమిషాల సమయమే తీసుకునేవాడు. మండుటెండలో చెమటలు కారుతున్నా తవ్వడం ఆపేవాడు కాదు. నేను అప్పుడప్పుడు అదీ రాళ్లను తీసేందుకే సాయం చేసేవాడ్ని' అంటూ కొడుకు గురించి గొప్పగా చెబుతున్నాడు తండ్రి రమేష్‌. రమేష్‌ కూరగాయల మార్కెట్లో రోజుకూలీకి పనిచేస్తున్నాడు. 'నాలుగురోజులు శ్రమించిన తరువాత ఒకరోజు భూమి నుండి నీటి ఊట బయటికి వచ్చింది. అప్పుడు నా బిడ్డ కళ్లు ఎంతగా మెరిశాయో నాకు ఇప్పటికీ గుర్తుంది' అంటూ తనయుడు చేసిన సాహసకార్యం గురించి గొప్పగా చెబుతోంది తల్లి దర్శన. 'అమ్మ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చాలా దూరం ప్రయాణించి బకెట్లతో నీళ్లుతెచ్చేది. ఆ నీళ్లే ఇంటి అవసరాలకు, వంటకు వాడుకునేవాళ్లం. బకెట్లు మోసి మోసీ అమ్మ చేతులు బొబ్బలెక్కేవి. అయినా నీళ్లు తేవడం తప్పేది కాదు. అమ్మ కష్టం చూడలేకపోయాను. అమ్మకు సాయంగా ఏదైనా చేయాలనుకుని బావి తవ్వడం ప్రారంభించాను. 20 అడుగుల లోతులోనే నీరు పైకి వచ్చింది. చాలా సంతోషమేసింది' అంటూ ప్రణవ్‌ చెబుతున్నప్పుడు అమ్మ పట్ల అతని ప్రేమ కళ్లల్లో కనిపిస్తోంది.
          అమ్మ కోసం ప్రణవ్‌ బావి తవ్విన వార్త ఊరంతా దావాణంలా వ్యాపించింది. బావిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రణవ్‌ స్నేహితులు, కుటుంబాలు కదిలివస్తున్నాయి. 'మా స్కూలు టీచర్లు కూడా వచ్చారు. బావిని చూసి నన్ను చాలా మెచ్చుకున్నారు' అని నవ్వుతూ చెబుతున్నాడు ప్రణవ్‌. ఈ ఘటనతో సంకల్పం గట్టిదైతే వయసు అడ్డంకి కాదని మరోసారి రుజువైంది.