Aug 10,2022 08:49

వంగర : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఇంటికెళ్లడానికి ఏకంగా ఆర్‌టిసి బస్సునే దొంగిలించాడు. అదికూడా పోలీస్‌ స్టేషన్‌ ముందున్న ఆర్‌టిసి డిపో బస్సును తీసుకెళ్లిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు విచారణ చేపట్టి ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పాలకొండ ఆర్టీసీ డిపో వద్ద చోటుచేసుకుంది.

పోలీసుల కథనం మేరకు ... గత సోమవారం రాత్రి పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్స్‌ బస్సు డ్రైవర్‌ పి.బుజ్జి రాజాం నుంచి వంగరకు వచ్చి విద్యార్థులను దింపేశారు. ఆ తరువాత బస్సును వంగర పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా నిలిపి వెళ్లారు. మరుసటి ఉదయం నాలుగు గంటల సమయంలో వచ్చి చూడగా ఆ బస్సు కనిపించలేదు. సహచరుల సాయంతో గ్రామంలో వెతికారు. ఎక్కడా కనిపించకపోయేసరికి వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సు కనిపించడం లేదన్న విషయాన్ని పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వరరావుతోపాటు డిపో సీఐ లక్ష్మణరావుకు కూడా తెలిపారు. మంగళవారం ఆర్టీసీ అధికారులు వంగర పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కొన్ని గంటల తరువాత రేగిడి ఆమదాలవలస మండలం మీసాల డోలపేట సమీపంలో బస్సు ఉన్నట్లు తెలిసింది. వంగర పోలీసులతో రాజాం సీఐ కె.రవికుమార్‌, ఆర్టీసీ అధికారులు కలిసి వెళ్లి అక్కడికి చేరుకున్నారు. కనిపించకుండాపోయిన ఆర్టీసీ బస్సు అదేనని గుర్తించారు. బస్సుపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. ఆ తరువాత బస్సును వంగర ఠాణాకు తీసుకొచ్చారు. అనుమానితులను రాజాం పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. నిందితుడు పొందూరు మండలం గోకర్ణపల్లికి చెందిన చౌదరి సురేష్‌గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. మద్యం తాగి మత్తులో సోమవారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సులో వంగరకు చేరుకున్నాడని, తిరిగి ఇంటికి వెళ్లడానికి అదే బస్సును తీసుకువెళ్లినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సిఐ కె.రవికుమార్‌ మాట్లాడుతూ ... నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.