Nov 24,2022 17:43

ప్రజాశక్తి - అమరావతి : ఇప్పటంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు షాక్‌ తగిలింది. ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 14మందికి ఫైన్‌ వేస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు ముందు నోటీసులు ఇచ్చినా, నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు తమ పిటిషన్లలో పేర్కొనడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో హైకోర్టు గతంలో స్టే ఇవ్వగా, ఇవాళ ఇరువర్గాల వాదనలు విన్నది. ఇళ్ల కూల్చివేతలపై తమకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పిటిషన్‌ దారులు పేర్కొనగా, నోటీసులు ఇచ్చిన తర్వాత ఆక్రమణలు కూల్చివేశామని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నారంటూ హైకోర్టు ఆరోపించింది. మొత్తం 14 మంది పిటిషన్‌ దారులకు హైకోర్టు భారీ జరినామా విధించింది.