Nov 25,2022 08:40

ఎక్కడో పుట్టాడు.. ఎక్కడో పెరిగాడు.. హోటల్లో కప్పులు కడిగాడు. చెత్తకుప్పల్లో చెత్త ఏరాడు.. కడుపు నిండాలంటే ఏదైనా పని చేయాలి. ఆ పని కోసం ఈ దరి నుంచి ఆ దరికి కాల్వ ఈదేవాడు. అయినా పని దొరక్కపోతే ఆ చెత్తకుప్పలే ఆకలి తీర్చేవి. ఇన్ని కష్టాలు, బాధల మధ్య అతనో కల కన్నాడు. బాగా చదువుకోవాలి. చెత్త ఏరుకుంటున్న చెత్తకుండీ ఎదురుగా ఉన్న బ్యాంకులో ఉద్యోగం చేయాలని.. అలా 'కల అంటే నిద్రలో వచ్చేది కాదు.. నిద్ర పోనివ్వకుండా చేసేది' అన్నట్లుగా తన కల సాకారం కోసం అవిశ్రాంతంగా పోరాడి లక్ష్యం చేరుకున్న ఓ విజేత కథ ఇది.

His-dream-did-not-come-in-his-sleep

సందీప్‌ తండ్రి కోలకత్తా వాసి. తల్లి కడపకు చెందిన వారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలోని ఆడపిల్లను ఆమె కంటే 25 ఏళ్లుపెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కడుపులో బిడ్డను మోసుకుంటూ ఆమె అతని వెంట తన వారెవరూ లేని చోటికి ప్రయాణమైంది. బిడ్డ పుట్టిన మూడేళ్లకే అతని నుంచి వేధింపులు ఎదురై మళ్లీ పుట్టింటికి చేరింది. ఆ మూడేళ్ల బిడ్డే సందీప్‌. పెళ్లి, బిడ్డ పెంపకం ఏమీ తెలియని వయసులో ఆ తల్లి సందీప్‌ను బంధువుల ఇంటికి పంపించేసింది. అక్కడ ఎన్నో అవమానాల మధ్య సందీప్‌ బాల్యం గడిచింది. 'బంధువుల ఇంట్లో నాతోటి పిల్లలు స్కూలుకు వెళుతుంటే నేను మాత్రం ఇంట్లోనే ఉండిపోయేవాడిని. ఇంటి పనులు చేసేందుకు నన్ను స్కూలుకు పంపేవారు కాదు. మీ అమ్మ మాకేమైనా డబ్బులు ఇచ్చిందా! మేమైనా నీకు బాకీ ఉన్నామా! అంటూ నానా దుర్భాషలాడేవారు. హోటల్లో పని చేసి వాళ్లకు డబ్బులిమ్మనేవారు. చాలా బాధేసేది' అంటున్న సందీప్‌ గమ్యం లేని తన ప్రయాణాన్ని కొనసాగించేందుకు హోటల్‌ పక్కనే ఉన్న కడప రైల్వే స్టేషనులో కనిపించిన రైలెక్కేశాడు. అది తిరుపతి చేరింది. తిరుపతి జంక్షన్‌లో రైలు దిగిన అతనికి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఎవరో పెద్దమనిషి విజయవాడలో అనాథ పిల్లలను అక్కున చేర్చుకునే ఓ వసతి గృహం అడ్రస్‌ చెప్పి అక్కడికి పంపించాడు. వసతి గృహానికైతే చేరుకున్నాడు. తిండి, బట్టకు లోటు లేదు. కానీ అరకొర వసతులతో నడుస్తున్న అక్కడ తన చదువు కల నెరవేరేలా లేదు. ఆ ఆలోచన అతన్ని నిద్రపోనీయ్యలేదు. వసతి గృహ నిర్వాహకులకు తెలియకుండా తెల్లవారుజామున పక్కనే ఉన్న ఏలూరు కాల్వకు అడ్డంగా ఈ దరి నుంచి ఆ దరికి ఈదుకుంటూ వెళ్లి ఏలూరు లాకులు దగ్గర ముఠా కార్మికులను తీసుకెళ్లే పుట్‌పాత్‌పై ఎవరైనా పనికి తీసుకెళతారేమోనని ఎదురుచూస్తూ నుంచొనేవాడు. పని దొరికిన రోజు పని చేసుకోవడం, లేని రోజు చెత్త కాగితాలు ఏరుకుంటూ గడిపేవాడు. ఆకలి వేసినప్పుడు ఆ చెత్త కుప్పల్లో దొరికే రొట్టెలు తినేవాడు.

His-dream-did-not-come-in-his-sleep


       'పగలు పనిచేసుకుంటూ కాస్తో కూస్తో వచ్చిన డబ్బులు తీసుకెళ్లి రాత్రి పూట వసతిగృహం నిర్వహించే నిర్వాహకుడికి ఇచ్చేవాడిని. అలా నాలుగేళ్లు పూర్తయి డబ్బులు తీసుకుందామనుకునేసరికి అతను అక్కడ పని మానేశాడు. నాకే ఇలా ఎందుకు జరుగుతోంది. అమ్మ లేదు. నాన్న ఉన్నాడో.. లేడో.. తెలియదు. ఇప్పుడు నమ్మిన వ్యక్తి మోసం చేశాడు అంటూ బాధపడేవాడిని' అంటున్న సందీప్‌ను ఓ రోజు వసతిగృహ స్థాపకుడు అనుకోకుండా కలిశారు. దీనస్థితిలో ఉన్న అతన్ని అక్కున చేర్చుకుని తనకి జరిగిన అన్యాయానికి తాను బాధ్యత వహిస్తానంటూ ముందుకు వచ్చారు. అప్పుడు 'నాకు ఆ డబ్బులు వద్దు. ఎక్కడైనా స్కూల్లో చేర్పించండి. నాకు చదువుకోవాలనుంది' అని తన మనసులో మాట బయటపెట్టాడు సందీప్‌.
 

                                                                   బడి బాట

సందీప్‌ స్కూల్లో చేరాడు. పదేళ్ల వయసులో ఒకటో తరగతికి వెళ్లాడు. చదువుపై ఉన్న ఆసక్తితో చాలా తక్కువ సమయంలోనే పదోతరగతి పాసయ్యాడు. ఇప్పుడు మళ్లీ అతని సమస్య మొదటికొచ్చింది. ఇన్నేళ్లు దొరికిన వసతి ఇప్పుడు లేదు. అయినా భయపడలేదు. చదువుకుంటూనే డబ్బులు ఎలా సంపాదించవచ్చో స్కూలు నిర్వాహకులు నేర్పించిన పాఠాలను ఆకళింపు చేసుకున్న అతడు మళ్లీ పనివేట ప్రారంభించాడు. కాలేజీ చదువు, తిండి, వసతి ఇప్పుడు తన ముందున్న లక్ష్యం. స్వతహాగా తనకు అబ్బిన డ్యాన్సును ఇతరులకు నేర్పిస్తూ.. పాలప్యాకెట్లు, పేపర్లు వేస్తూ డబ్బు సమకూర్చుకోవడంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించినా ఇంటర్‌ ఉత్తీర్ణత కాలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ అతన్ని నిరాశ ఆవరించింది. 'పని చేసుకుంటేనే చదువుకునేది మరో దారి లేదు. ఇప్పుడెలా..!' అనుకుంటూ ప్రైవేటుగా డిగ్రీ కట్టి ఎంబిఎ పాసయ్యాడు.
        ఎంబిఎ పట్టా పుచ్చుకుని తను కల గన్న బ్యాంకు ఉద్యోగం కోసం వెళ్లాడు. అతని ప్రతిభకు వెంటనే ఉద్యోగం వచ్చింది. ఎక్కడైతే తను చెత్త ఏరుకున్నాడో దానికెదురుగా ఉన్న బ్యాంకులోనే ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ విభాగానికి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలు. ఇక్కడితో సందీప్‌ లక్ష్యం పూర్తవ్వలేదు. చదువుకుంటున్నప్పటి నుంచి తనలా వీధుల్లో తిరిగే పిల్లలు ఎక్కడ కనిపించినా వారిని కూర్చోబెట్టి మాట్లాడేవాడు. చదువు విలువ, డబ్బు విలువ చెప్పేవాడు. ఇప్పుడు కూడా వీధిబాలలు, అనాథలు, ఆర్థికంగా కుదేలైన పిల్లల కుటుంబాలను తరచూ కలుస్తాడు. చేతనైనంత సాయం చేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సాయం చేయాలన్న లక్ష్యంతో ఉన్న అతను తన అవసరాలను కూడా వదులుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. సందీప్‌ లాంటి పిల్లలు మనకు తరచూ కనపడుతూనే ఉంటారు. అవగాహన లేక, ఆదరణ లేక సమాజంపై కక్ష పెంచుకుని మత్తు పదార్థాలకు బానిసలై, నేరప్రవృత్తి వైపు ప్రయాణించేవాళ్లనూ చూస్తూ ఉంటాం. అందరిలా సందీప్‌ చూస్తూ ఊరుకోలేదు. ఆ పిల్లలు పడే బాధలు, వారి ఆకలి కేకలు తనకు తెలుసు. అందుకే ఉద్యోగం తన లక్ష్యమైనా అంతకుమించిన సేవమార్గంలో నడుస్తున్నాడు. తన మార్గం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. లక్ష్యం ముందు ఎంతటి కష్టమైనా చిన్నదే అని నిరూపించిన సందీప్‌ నిజమైన లక్ష్యసాధకుడు.
                                                                           - జ్యోతిర్మయి