Aug 19,2022 07:30

కర్నాటకలో ఉడిపి పట్టణ ప్రాంతంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 19న ఉత్సాహవంతమైన వాతావరణంలో సాంస్కృతిక వేడుకలు జరుగుతాయి. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా వేడకలకు ముందు కొన్ని రోజులు కళాకారులకు శిక్షణ ఇచ్చారు. ఈసారి కొంతమంది వికలాంగులు పులి నృత్యమైన హోలివేషం వేస్తామని ముందుకు వచ్చారు. అందుకుగానూ 20 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. అంగవైకల్యం ఉన్నా, మధ్య వయస్సులో ఉన్నా పట్టువదలకుండా ప్రయత్నం చేశారు.
వాచ్‌మెన్‌ ప్రశాంత్‌, టైలర్‌ విజరుకుమార్‌, రైతు అయిన ఆనంద శేరిగర్‌, రకరకాల జీవనోపాధి పనులు చేసుకుంటున్న కృష్ణ, రవి, జగదీష్‌ భట్‌, శేఖర్‌ ఇందులో ఉన్నారు. వీరంతా 40 - 50 వయస్సులో ఉన్నవారు. అయితే నృత్యం చేయాలని ఎప్పటినుంచో వీరికి కోరిక. ఇప్పటివరకూ వీరికి ఆ దిశగా ప్రోత్సహించిన వారు లేకపోవడంతో ఆ కల అలాగే ఉండిపోయింది. కృష్ణాష్టమికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఈ ఏడుగురూ ఒక బృందంగా ఏర్పడి 'పులి నృత్యం' వేస్తామని కమిటీకి చెప్పారు. వారి ఆసక్తిని గమనించి సాంస్క ృతిక విభాగం సభ్యులు సరే అన్నారు. వికలాంగులు ఈ నృత్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధని కళాకారుడు షెరిగర్‌ తెలుసుకున్నారు. ఎక్కడా రాజీ పడకుండా ప్రతిరోజూ సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకూ శిక్షణ ఇచ్చారు.
దీనికి కొన్ని నెలల ముందు ఈ బృందంలోని జగదీష్‌ భట్‌ మణిపాల్‌లోని పీస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలైన డాక్టర్‌ సోనియాను సంప్రదించాడు. తామంతా కలిసి నృత్యం వేయాలనుకుంటున్నామని ఆమెకు తెలిపాడు. ఆమె ధైర్యంగా నృత్యం నేర్చుకొమ్మని వారిని ప్రోత్సహించారు. 60- 75 శాతం వైకల్యం ఉన్న వీరంతా కష్టపడి నృత్యం నేర్చుకున్నారు. ముందుకు వంగి ఒంటిచేత్తో, ఒంటి కాలితో డ్యాన్సు వేశారు. ఒక్కరు కూడా మధ్యలో మానేయలేదు. నృత్య ప్రదర్శనకు గానూ కమిటీ ఇచ్చే లక్ష రూపాయల పారితోషికాన్ని పేద రోగులకు ఇవ్వాలని ఈ బృందం భావిస్తోంది.