Sep 27,2022 13:20

కడప : బంగారానికి, డబ్బుకి ఆశపడి సొంత తల్లిదండ్రులే తమ 16 ఏళ్ల కుమార్తెను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి బాల్యవివాహం చేసిన ఘటన వైఎస్‌ఆర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు సోమవారం 'స్పందన' కార్యక్రమంలో ఎస్పీ అన్బురాజన్‌ను ఆశ్రయించి వినతిపత్రం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకెళితే ... కడప నగరానికి చెందిన బాలిక (16) తొమ్మిదో తరగతి వరకు చదివింది. ఓ యువకుడిని ప్రేమించింది. ఆమె తల్లిదండ్రులకు అతనంటే ఇష్టం లేదు. ఇటీవల తమ కుమార్తెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ విషయం దిశ పోలీసులకు తెలియడంతో బాలిక తల్లిదండ్రులను ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండాకనే పెళ్లి చేయాలని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వయసున్న వ్యక్తికి తమ కుమార్తెనిచ్చి ఆగష్టులో వివాహం చేశారు. వరుడు బాలిక తల్లిదండ్రులకు ఏడు తులాల బంగారాన్ని, రూ.2 లక్షల నగదును ఇచ్చినట్లు సమాచారం. అయితే అతనితో కాపురం చేయడానికి బాలిక ఇష్టపడలేదు. సోమవారం తల్లిదండ్రులకు తెలియకుండా వచ్చి 'స్పందన' కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు నమోదు చేయాలని దిశ పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఈ విషయమై దిశ ఠాణా డీఎస్పీ వాసుదేవన్‌ను వివరణ కోరగా బాల్యవివాహం జరిగిన మాట వాస్తవమేనన్నారు. మంగళవారం ఆధారాలు సేకరించిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.