Sep 21,2022 15:09

ఇంటర్నెట్‌డెస్క్‌ : నేటికాలంలో చాలా బ్యాంకులు పొదుపు ఖాతాకు సంబంధించిన అనేక పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయి. మరి అలాంటి పొదుపు పథకాలకు సంబంధించిన సౌకర్యాలను, బ్యాంకులు అందిస్తున్న సేవలను వినియోగించుకోవడానికి వినియోగదారులకు ఎన్ని బ్యాంకు ఖాతాలుండాలి? ఒకటి, రెండు, లేక అంతకన్నా ఎక్కువ బ్యాంక్‌ ఎకౌంట్స్‌ ఉంటే ప్రయోజనమా? లేక ఒకరికి ఒక బ్యాంక్‌ ఎకౌంట్‌ ఉంటేనే మంచిదా..?!

మినిమం బ్యాలెన్స్‌
బ్యాంక్‌ ఎకౌంట్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయాలి. బ్యాంకులు ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉందా లేదా అని చెక్‌ చేస్తాయి. అలాగే సర్వీసింగ్‌, ఖాతా నిర్వహణ, ఖర్చును పరిగణనలోకి తీసుకుంటాయి. వినియోగదారులు తమ ఎకౌంట్‌ని సరిగ్గా మెయింటెయిన్‌ చేయలేకపోతే.. బ్యాంకులు నిర్దిష్ట ఛార్జీలను కూడా విధిస్తాయి. అయితే బహుళ బ్యాంక్‌ ఎకౌంట్స్‌లో మినిమం బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయాలంటే వినియోగదారులకు కష్టంగా ఉంటుంది. అందుకు తమకు అనుకూలంగా ఉండేవిధంగా.. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఒకటి, రెండు బ్యాంక్‌ అకౌంట్స్‌లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉండేలా చూసుకోవడం మంచిది.

బహుళ బ్యాంక్‌ అకౌంట్స్‌ వల్ల ప్రయోజనం
సేవింగ్‌ ఎకౌంట్స్‌కి డెబిట్‌ కార్డులు లింక్‌ చేయడం వల్ల.. రోజులో పరిమితికి లోబడే డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అదే బహుళ బ్యాంక్‌లలో ఎకౌంట్స్‌.. ఎక్కువ నగదును తీసుకునే అవకాశముంటుంది. బహుళ బ్యాంకు ఖాతాలున్న వినియోగదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. అయితే బ్యాంక్‌ ఎకౌంట్‌ను సరిగ్గా వినియోగించుకోకపోతే.. ఆ ఖాతాను బ్యాంక్‌ తీసేస్తుంది. లేదా అదనపు ఛార్జీలను వసూలు చేసే అవకాశముంటుంది.

బ్యాంక్‌ ఛార్జెస్‌
బ్యాంకులు కొన్ని సేవలను ఉచితంగా అందిస్తాయి. మరికొన్ని రుసుముతో కూడుకున్నవి ఉంటాయి. వినియోగదారులు బ్యాంకులు అందించే రుసుములను, ఛార్జీలను తెలుసుకోవాలి. బ్యాంకులు వేసే అనేక ఛార్జీల గురించి ఖాతాదారులకు తెలియదు. అందుకే వినియోగదారులు ఛార్జీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం మంచిది. ఆ తర్వాతే ఎన్ని ఖాతాలుంటే మంచిదో నిర్ణయించుకోవాలి.