May 26,2023 09:05

చిన్న పిల్లలు చాలా విషయాలను, అలవాట్లను తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. ఎందులోనైనా అమ్మనాన్నలనే రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి సైకలాజిక్‌ థియరీస్‌, సోషల్‌ స్కిల్స్‌ నేర్చుకుంటారు. అందువల్ల వారికి రోల్‌ మోడల్‌గా ఉండటం తల్లిదండ్రులకు చాలా కీలకం. అయితే చాలామంది తల్లిదండ్రు లు తమకు తెలియ కుండానే పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంటారు. ఇది వారిపై మానసిక ప్రభావాన్ని చూపి ప్రతికూల ధోరణి కలిగిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

                                                                     స్వీయ విమర్శలు

చాలా సందర్భాల్లో దంపతులు తమ అందం, కెరీర్‌, ఆర్థిక విషయాల గురించి తమను తాము నిందించుకుంటారు. ఇలాంటివి పిల్లల ఎదుట చేస్తే సరైన లక్ష్యాలు రూపొందించుకోవడంలో వారు ఫెయిల్‌ అవుతారు. ఇది పిల్లల్లో ఒత్తిడికి కారణమౌతుంది.

                                                                తల్లిదండ్రుల చెడు అలవాట్లు

తల్లిదండ్రుల్లో చాలామంది తమకున్న అలవాట్లను పిల్లల ఎదుట ప్రదర్శిస్తారు. తండ్రి పిల్లల ముందే మద్యపానం చేయడం, సిగరెట్‌ కాల్చడం వల్ల పిల్లలు కూడా వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంది.


                                                                              గ్యాడ్జెట్స్‌

ఇటీవల కాలంలో గ్యాడ్జెట్స్‌ వినియోగం బాగా పెరిగిపోయింది. భార్యభర్తలు పక్కపక్కనే ఉన్నా ఎవరి ఫోన్లో వారు బిజీగా మారిపోతున్నారు. పిల్లలను కూడా పట్టించుకోకుండా వాళ్ల ముందే సోషల్‌మీడియా, మెసేజింగ్‌, కాల్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ ధోరణితో పిల్లలు కూడా వాటికి అడిక్ట్‌ అయ్యే ప్రమాదం ఉంది. తమకు కూడా మొబైల్‌ కావాలని పట్టుబడతారు. తిండి, చదువు విషయంలోనూ గ్యాడ్జెట్స్‌ ఇస్తేనే చేస్తాం అన్న పంతం పెరిగిపోయి మొండిగా తయారవుతారు. ఇలాంటి ప్రవర్తన వాళ్ల చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
 

                                                                             పోలికలు వద్దు

తల్లిదండ్రులు తమ పిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటారు. ముఖ్యంగా చదువులో అందరికంటే పైచేయి సాధించాలని తాపత్రయ పడుతుంటారు. అంచనాలను అందుకోకపోతే వాళ్ల స్నేహితులు, పక్కింటి పిల్లలు, బంధువుల పిల్లలతో పోల్చుతుంటారు. ఈ పద్ధతి వాళ్లను నిరుత్సాహానికి గురిచేస్తుంది. వాళ్లను ఎంకరేజ్‌ చేయడానికే ఇలా చేస్తున్నామని తల్లిదండ్రులు చెప్పుకున్నా పిల్లలపై సైకలాజికల్‌గా తీవ్ర ప్రభావం పడుతుంది.
 

                                                                          వాదనలు వద్దు

పిల్లలు పక్కన ఉన్నప్పుడు ఇంట్లోని పెద్దవాళ్లు అతిగా వాదించుకోకూడదు. అది చూసి వాళ్లు కూడా అలాంటి ప్రవర్తననే అలవరుచుకునే ప్రమాదం ఉంటుంది. స్కూల్‌, ఆటలు ఆడే సమయాల్లో తమ వాదనే నెగ్గాలన్న ధోరణి పెరిగిపోయి అందరికీ దూరమయ్యే ప్రమాదం ఉంది.
 

                                                                         కొట్టడం, తిట్టడం

పిల్లలు తెలిసో, తెలియకో ఏదైనా తప్పుచేస్తే తల్లిదండ్రులు వెంటనే దండించేస్తారు. గట్టిగా అరవడం, తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. ఇది ఎంతమాత్రం మంచి పద్ధతి కాదు. చిన్న వయసులోనే వారిని దండించడం వల్ల మీపై వారిలో వ్యతిరేక భావన కలగొచ్చు. ఈ ధోరణి వారి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.