May 26,2023 11:38

పిచ్చాటూరు (చిత్తూరు) : పిచ్చాటూరు లోని శ్రీకాళహస్తి రోడ్డు వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాల డైరీ నుండి వెలువడే వ్యర్ధాలను ఇరిగేషన్‌ కాలువలోకి నేరుగా వదిలేస్తున్నారనీ, ఆ నీరు ప్రవహిస్తే తమ పంటలు, భూములు నాశనమవుతాయని రైతులు శుక్రవారం నిరసన చేపట్టారు.

రైతులు మాట్లాడుతూ ... పిచ్చాటూరు లోని శ్రీకాళహస్తి రోడ్డు వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాల డైరీ వికృత చేష్టలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. రాత్రి వేళల్లో పాల డైరీ పూర్తి వ్యర్ధాన్ని యాజమాన్యం కాలవలో వదిలేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలువ పిచ్చాటూరు గ్రామం నివాసాల మధ్యలో ప్రవేశించి పొలాల్లోకి ప్రవహిస్తుందని, కాలువలో ప్రవహించే నీరు పాలవలే మారి తెల్లగా తీవ్ర దుర్వాసన వస్తుందని తెలిపారు. ఈ దుర్వాసన భరించలేకపోతున్నామని, ఈ నీరు ప్రవహిస్తే తమ పంటలు, తమ భూములు బతుకుతాయా ? అని రైతులు, అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇకపై డైరీ వ్యర్ధ నీరు కాలువలో ప్రవహిస్తే పాల డైరీ ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.