Mar 19,2023 08:56

ఈక్వెడార్‌ : దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌, ఉత్తర పెరూ తీర ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిచ్‌టర్‌ స్కేలుపై 6.8గా నమోదయింది. ఈ భూ కంపం ధాటికి ఇళ్లు కూలి 14 మంది మరణించారు. చాలా ఇళ్లు, హాస్పిటల్స్‌, స్కూల్స్‌, ఇతర భవంతులు ధ్వంసమయ్యాయని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. నగరాల్లో శిథిలాల దిబ్బలు కనిపించాయి. భూమి కంపించగానే భయాందోళనకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. రెస్క్యూ అధికారులు సహాయం అందించడానికి అక్కడికి చేరుకున్నారు.అమెరికన్‌ జియోలాజికల్‌ సర్వే ప్రకారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 66 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. అదే10 కిలోమీటర్ల లోతున వచ్చి ఉంటే.. దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండేది. భూ కంప నాభి పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈక్వెడార్‌ మునిసిపాలిటీ బాలావోలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.