Jan 24,2023 22:22

అధిక ధరలతో పెరిగిన ఆహార అభద్రత
ఎఫ్‌ఎఓ నివేదిక వెల్లడి

బ్యాంకాక్‌ : అధిక ధరలు, పెరుగుతున్న దారిద్య్రంతో ఆసియా ఖండంలో ప్రజానీకం తీవ్ర ఆహార అభద్రతకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితికికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎప్‌ఎఓ) పేర్కొంది. యునిసెఫ్‌, డబ్ల్యుహెచ్‌ఓ తదితర సంస్థలతో కలిసి రూపొందించిన నివేదికను ఆ సంస్థ మంగళవారం విడుదల చేసింది. దక్షిణాసియాలో దాదాపు 50కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కుంటున్నారని, ప్రతి ప్రతి పదిమందిలో 8 కన్నా ఎక్కువమందే ఈ దుస్థితిలో ఉన్నారని పేర్కొంది. మరో వంద కోట్ల మంది ప్రజలు ఒక మోస్తరు నుండి తీవ్ర ఆహార అభద్రతను 2021లో ఎదుర్కున్నారని తెలిపింది. ఇక మొత్తంగా ప్రపంచ దేశాల్లో 2014లో ఆహార అభద్రత 21శాతంగా వుండగా, 2021 వచ్చేసరికి అది 29శాతానికి పైగా పెరిగింది. 'కోవిడ్‌ మహమ్మారితో పెద్ద ఎదురుదెబ్బ తగలింది. మూకుమ్మడిగా ఉద్యోగాలు పోయాయి. తర్వాత వచ్చిన ఉక్రెయిన్‌లో యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అనేక లక్షలమందికి తగినంత ఆహారం అందుబాటులో లేకుండా పోయింది.' అని ఆ నివేదిక పేర్కొంది. ఈ గణాంకాలు చూసినట్లైతే, ఆకలిపై పోరాటంలో మందగమనం కొనసాగుతోందని నివేదిక వ్యాఖ్యానించింది. నగరాలకు తరలివెళ్ళిపోయిన ప్రజలు ఆహార అభద్రత సమస్యను చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారని, అక్కడ వారికి అందుబాటు ధరల్లో ఆహారం దొరికే పరిస్థితి లేదని పేర్కొంది.
200 కోట్లమందిపై ప్రభావం
'ధాన్యం, గోధుమలు, చమురు వంటి ప్రాధమిక వస్తువుల ధరలు పెరుగుతూ రావడం పేదలను బాగా దెబ్బతీసింది. ఆహారం, ఆకలి, ఎరువులు, ఇంధనం, ఆర్థిక సాయం - '5ఎఫ్‌' సంక్షోభంగా ఐక్యరాజ్య సమితి సంస్థలు పిలిచే ఈ పరిస్థితిలో ఇదంతా ఒక భాగమే. గోధుమలు, వంట నూనెలు, ఎరువులు కోసం ఉక్రెయిన్‌పై ఆధారపడే దేశాలకు అక్కడ యుద్ధం బాగా దెబ్బతీసింది.' అని నివేదికలో పేర్కొన్నారు. దాదాపు రెండు వందల కోట్ల మంది ఇలా ఉక్రెయిన్‌పై ఆధారపడుతున్నారని, వారిలో 45శాతం మంది ఆసియాలోనే వున్నారని తెలిపింది. 'వీరికిఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదు. దాంతో వారు రక్తహీనత, ఊబకాయం, క్షుద్భాద వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.' అని పేర్కొంది.

పిల్లల ఎదుగుదలలో సమస్యలు ...
అనారోగ్యకరమైన ఆహారం, తగినంత రీతిలో ఆహారం లభ్యం కాకపోవడంతో భవిష్యత్‌ ఆరోగ్యం, ఉత్పాదకత విషయంలో రాజీపడాల్సి వస్తుందని, ఫలితంగా పిల్లలు ఎదుగుదల సమస్యలతో బాధపడతారని, వారు మరింత అస్వస్థతకు గురవడానికి అవకాశాలు ఎక్కువుగా వుంటాయని నివేదిక హెచ్చరించింది. ఆసియాాపసిఫిక్‌ ప్రాంతంలో దాదాపు నాలుగోవంతు మంది పిల్లలు సరిగా ఎదగకపోవడం అంటే వారి వయస్సుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది.
క్లుప్తంగా :
. ఆఫ్ఘనిస్తాన్‌లో 70శాతం మంది ఒక మోస్తరు నుండి తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత విదేశీ సాయం కూడా నిలిచిపోవడంతో పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి.
కంబోడియాలో దాదాపు సగం మంది జనాభాకు సరిపడనంతా ఆహారం లేదు.
. ఆసియా మొత్తం మీద 15ా49ఏళ్ల వయస్కుల్లో మూడో వంతుమంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.
దీంతో ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి.