Oct 02,2022 11:02

ఫ్లోరిడా : కొద్ది రోజుల క్రితం క్యూబాను అతలాకుతలం చేసి ఫ్లోరిడా వైపునకు దూసుకువచ్చిన అత్యంత శక్తివంతమైన ఇయాన్‌ తుపాను ఇక్కడ బీభత్సాన్ని సృష్టించిన అనంతరం దక్షిణ కెరోలినా నగరమైన జార్జిటౌన్‌ సమీపంలో తీరాన్ని దాటింది. ఈ ప్రభావంతో గంటకు 140కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కేటగిరీ వన్‌ తుపానుగా ఇయాన్‌ను వర్గీకరించారు. ఇప్పటివరకు ఈ తుపాను ధాటికి 23మంది మరణించారు. తుపాను కారణంగా బోటు మునిగి అందులో ప్రయాణిస్తున్న 17మంది శరణార్ధుల ఆచూకీ తెలియకుండా పోయింది. వారి కోసం గాలిస్తున్నారు. ఈ తుపాను కారణంగా భారీ వర్షాలు, అకస్మాత్తుగా వరదలు, ఈదురు గాలులు వీచాయని, అపారమైన నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు. విధ్వంసం స్థాయిని ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సి వుందని అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన నష్టాన్ని కలిగించిన తుపానుల్లో ఒకటిగా ఇది నమోదు కానుందని అన్నారు. వందల కోట్ల డాలర్ల మేరకు నష్టం కలిగివుంటుందని భావిస్తున్నారు. 1992లో ఆండ్రూ హరికేన్‌ తర్వాత ఇంత విధ్వంసాన్ని, నష్టాన్ని కలిగించిన తుపాను ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు.