Jan 24,2023 22:08

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో పెదకోట, చుట్టేరుపాడు, గుజ్జేరి ప్రాంతాలతోపాటు చింతపల్లి మండలం ఎర్రవరంలో చేపడుతున్న హైడల్‌ ప్రాజెక్టులు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని మాజీ ఎంపి పి మధు కోరారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. నాలుగు ప్రాజెక్టుల్లో 8 డ్యాములు నిర్మిస్తున్నట్లు 5500 మెగావాట్ల హైడ్రోపవర్‌ ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోందని, 27 గ్రామాలు 8500 ఎకరాలు ముంపునకు గురవుతాయని నాలుగు వేల మంది నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల సాగునీరు, తాగునీరు, అందుబాటులో ఉన్న వనరులు పూర్తిగా దెబ్బతింటాయని, మరో 67 గ్రామాల్లో 10 వేల ఎకరాలు సాగు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సుమారు 100 గ్రామాలు, 20000 ఎకరాలు, 15 వేల మంది జనాభా ఈ ప్రాజెక్టులతో నిర్వాసితులవుతున్నారని వివరించారు. ఇది ఆర్ధికంగా ఈ ప్రాంతంలో ప్రజల మనుగడకు తీవ్ర ప్రమాదం తెస్తుందని, ఇప్పటికే అలజడి ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచించి ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని గిరిజనులు, స్థానిక ప్రజలు కోరుతున్నారని వెంటనే వారితో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కోరారు. 5వ షెడ్యూల్‌ ఏరియాలో చట్ట ప్రకారం గ్రామ సభలు జరగాల్సి ఉన్నా జరగలేదని, అటవీ హక్కుల కమిటీ తీర్మానం చేయలేదని వివరించారు. ముఖ్యంగా గిరిజన సలహా మండలి (టిఏసి) (ఎమ్మెల్యేల) తీర్మానం ఉండాలని ఉన్నా అది కూడా జరగలేదని పేర్కొన్నారు. ఇవి జరగకుండా చేయడమంటే రాజ్యాంగ ఉల్లంఘనేనని, ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కోరారు.