
- జగన్ ఆదేశాలతోనే నా ఫోన్ ట్యాపింగ్
- కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా : ఎంఎల్‌ఎ కోటంరెడ్డి
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : 'నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేదానికి నా వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నాపై నమ్మకం లేకుండా అవమానకరంగా వ్యవహరించిన వైసిపిలో ఇక పనిచేయలేను' అని, నెల్లూరు రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. నా ఫోన్‌ను ట్యాపింగ్ చేయడంపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల తాను మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, అక్కడకు వచ్చిన మీడియా, పోలీసుల వద్ద నా ఆవేదన వ్యక్తం చేశానని చెప్పారు. నా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పానని, అది అధికారిక ప్రెస్‌మీట్ కాదని పేర్కొన్నారు. ఏం జరిగిందో పార్టీ పెద్ద సంజాయిషీ అడిగుంటే ఇచ్చేవాడినని, అలాకాకుండా నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇన్‌ఛార్జిని ప్రకటిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. బారా షాహిద్ దర్గాకు జగన్ నిధులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ విడుదల చేయలేదని, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ తీరును విమర్శించానే తప్ప, పార్టీని విమర్శించలేదని తెలిపారు. తాను ఐ ఫోన్ వాడుతున్నానని, నా మిత్రుడైన కాంట్రాక్టర్ లంకా రామశివారెడ్డి ఫోన్ చేస్తే మాట్లాడానని తెలిపారు. నా మిత్రుడు కూడా ఐ ఫోనే వాడుతున్నాడని చెప్పారు. మా మధ్య జరిగిన సంభాషణను మా ఇద్దరిలో ఏ ఒక్కరిమీ రికార్డు చేయలేదని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజి సీతారామాంజనేయులు ఫోన్ చేసి, జగన్‌కు నీపై ప్రేమ ఉందని, ఎందుకు అలా మాట్లాడుతున్నావని నన్ను బెదిరించే పనిచేశారని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. నాకు, మా మిత్రుడికి మధ్య ఐ ఫోన్లలో జరిగిన సంభాషణను ఐజి తనకు పంపారని తెలిపారు. నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దానికి ఇంతకంటే ఆధారం ఇంకేమి కావాలని అన్నారు. రెండు రోజులుగా 35 మంది ఎంఎల్‌ఎలు, నలుగురు ఎంపిలు, ఇద్దరు మంత్రులు తనకు ఫోన్ చేసి బాధపడ్డారని తెలిపారు. మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. తనకు టిడిపి నుంచి పోటీ చేయాలని ఉందని వారితో చెప్పానని, చంద్రబాబునాయుడు టికెట్ ఇస్తే నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.