Mar 17,2023 15:45

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఆస్కార్‌ వేడుకలో తనని మాట్లాడనివ్వకుండా అవమానించారని 'ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' షార్ట్‌ ఫిల్మ్‌ నిర్మాత గునీత మోంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఆస్కార్‌ వేడుకలో తాను పాల్గొన్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో.. ఈ షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ కార్తీ వేదికపైకి వచ్చి స్పీచ్‌ ఇచ్చారు. ఆమె స్పీచ్‌ ముగియగానే నిర్మాత గునీత్‌ మాట్లాడేందుకు ప్రయత్నించేలోపే సమయం అయిపోందని మ్యూజిక్‌ ప్లే చేశారు. దీంతో తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే గునీత్‌ వెనుతిరిగినట్టు కనిపిస్తుంది. ఇక ఈ ఘటనపై గునీత్‌ స్పందిస్తూ.. 'ఆస్కార్‌ వేదికపై భారత్‌ నిర్మించిన ఓ షార్ట్‌ఫిల్మ్‌కు ఆస్కార్‌ రావడం ఇదే తొలిసారి అని గర్వంగా చెప్పాలనుకున్నా. డైరెక్టర్‌ కార్తీకి ఇచ్చిన సమయంలోపే తన స్పీచ్‌ని ముగించారు. కానీ నేను మాట్లాడే సమయానికి టైం అయిపోయిందని మ్యూజిక్‌ ప్లే చేశారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను. ఇంత దూరం వచ్చి నేను మాట్లాడలేకపోయానే అని ఎంతో బాధపడ్డాను. ఆస్కార్‌ అకాడమీ ఎంతో గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నట్లు అనిపించింది. ఈ అవార్డు దక్కడం వల్ల నాకు లభిస్తున్న ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది' అని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు అమెరికన్‌ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా భారత్‌ని ఆస్కార్‌ అకాడమీ అవమానించిందందని మండిపడుతున్నారు.
కాగా, సాధారణంగా ఆస్కార్‌ వేదికపై అవార్డు అందుకున్న తర్వాత 45 సెకన్లపాటు ప్రసంగించే అవకాశముంటుంది. ఒకవేళ ఎవరైనా ఆ సమయానికి మించి మాట్లాడితే ఆ స్పీచ్‌ని కట్‌ చేస్తారు. అయితే భారత్‌ తరపున వెళ్లిన ఈ ఇద్దరు మహిళల్లో డైరెక్టర్‌ కార్తీ ఇచ్చిన సమయంలోపే స్పీచ్‌ని ముగించిచారు. ఇక నిర్మాత గునీత్‌ మాట్లాడేలోపే మ్యూజిక్‌ ప్లే చేశారు. ఈ వేడుకలో మరికొంతమంది 45 సెకన్లకు మించి స్పీచ్‌ ఇచ్చినా కట్‌ చేయలేదు. ప్రత్యేకించి గునీత్‌ స్పీచ్‌ని అడ్డుకోవడంపై అమెరికా మీడియా సైతం అకాడమీపై మండిపడుతోంది.