Mar 24,2023 08:09
  • 45.7మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టు : 

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిఎంగా తొలి తొమ్మిదేళ్లపాటు పోలవరంపై కనీసంగా మాట్లాడని చంద్రబాబునాయుడికి ఆ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టుపై డిమాండ్‌ వున్నా 2004 తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డినే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని, ఆయన కుమారునిగా తానే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తానని పేర్కొన్నారు. గురువారం శాసనసభలో స్వల్పకాలిక చర్చలో భాగంగా సిఎం పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్లకు పరిమితమైందని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మొదట 41.15 మీటర్లను పూర్తి చేసి మూడేళ్లపాటు నీళ్లు నింపి, ఆ తర్వాత రెండోదశలో 45.7 మీటర్లను పూర్తి చేస్తామని అన్నారు. మరో 18 నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. మొదట తొమ్మిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబు పోలవరం గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని అన్నారు. ప్రాజెక్టు కోసం ఆయన చేసింది ఏమీ లేదని, అసలు పోలవరం అనే పేరు పలికే అర్హత తెలుగుదేశానికి గాని, చంద్రబాబుకు గాని లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు కమీషన్ల కోసం చేసిన పనుల వల్లే వరదల్లో దెబ్బతిందని చెప్పారు. అన్ని పనులు చంద్రబాబు చేశారంటూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలవరం నిధులను యథేచ్ఛగా దోచేశారని విమర్శించారు. ఎక్కువగా డబ్బు వచ్చే పనులను ముందు చేశారని అన్నారు. స్పిల్‌ వే పనుల్ని అసంపూర్ణంగా పునాదుల స్థాయిలోనే వదిలేసి, కాఫర్‌ డ్యాం పనుల్ని, డయాఫ్రంవాల్‌ పనులను చేపట్టారని తెలిపారు. అప్రోచ్‌ చానల్‌ పనులు కూడా చేపట్టలేదని అన్నారు. అసలు స్పిల్‌ వే పూర్తి కాకుండా కాఫర్‌ డ్యాం పనుల్ని ఎలా పూర్తి చేస్తారో చెప్పాలని అన్నారు. టిడిపి అనాలోచిత నిర్ణయం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని అన్నారు. చంద్రబాబుకు పోలవరం ఎటిఎంలాంటిదని స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ అంటే పోలవరం.. పోలవరం అంటే వైఎస్‌ఆర్‌ అని అన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.800కోట్లు ఆదా చేశామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో స్పిల్‌వే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులను పూర్తి చేశామని తెలిపారు.