Mar 18,2023 12:09

హేగ్‌ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కి ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి) శుక్రవారం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. ఉక్రెయిన్‌లోని పిల్లల్ని చట్టవ్యతిరేకంగా బహిష్కరించినట్లు పుతిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధినేత పుతిన్‌తోపాటు, రష్యాకు చెందిన చిల్డ్రన్‌ రైట్స్‌ కమిషనర్‌ మారియా లోవా బెలోవాకు కూడా హేగ్‌లోని ఐసిసి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. అయితే ఐసిసి జారీ చేసిన ఆదేశాలను రష్యా అధికారులు కొట్టిపారేశారు. ఐసిసిలో రష్యాకు భాగస్వామ్యం లేదని అధికారులు పేర్కొన్నారు. కానీ ఐసిసి తీర్పును ఉక్రెయిన్‌ స్వాగతించింది. దీన్ని చారిత్రాత్మక నిర్ణయంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు.
కాగా, గతేడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 16 వేల మంది చిన్నారులను రష్యా బహిష్కరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై పుతిన్‌ని అరెస్టు చేసే అవకాశముందని ఐసిసి వెల్లడించింది. ఐసిసి సభ్య దేశాలకు పుతిన్‌ వెళితే.. వెంటనే అతన్ని అరెస్టు చేసే అవకాశాలున్నాయి ఐసిసి ప్రాసిక్యూటర్‌ కరీమ్‌ ఖాన్‌ తెలిపారు. అయితే ఐసిసి వారెంట్‌ను జారీ చేసినా.. దాన్ని అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుందని ఐసీసీ ప్రెసిడెంట్‌ పియోటర్‌ హాఫ్‌మన్‌స్కీ తెలిపారు.