
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఐడిబిఐ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఆ బ్యాంక్ నికర లాభాలు 60 శాతం పెరిగి రూ.927 కోట్లకు చేరాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఎం) పెరగడం ఇందుకు దోహదం చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.578 కోట్ల లాభాలు సాధించింది. 2022 డిసెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 13.82 శాతానికి తగ్గాయి. ఇంతక్రితం ఏడాది ఇదే సమయానికి ఏకంగా 21.86 శాతం జిఎన్‌పిఎ చోటు చేసుకోవడం గమనార్హం. 2023 మార్చి ముగింపు నాటికి జిఎన్పిఎను 10 శాతానికి దిగువన పరిమితం చేయాలని నిర్దేశించుకున్నామని ఆ బ్యాంక్ ఎండి, సిఇఒ రాకేష్ శర్మ పేర్కొన్నారు. క్రితం క్యూ3లో బ్యాంక్ రుణ పుస్తకం 17 శాతం పెరిగి రూ.1.46 లక్షల కోట్లకు చేరింది.