Jan 25,2023 07:27

        ఉద్యోగులను తొలగిస్తూ ఐటి సంస్థలు ఎడాపెడా తీసుకుంటున్న నిర్ణయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో అధిక సంఖ్యాకులు భారతీయులేనన్న విషయం మరింత కలవరాన్ని కలిగిస్తోంది. అయినా ఏలినవారికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరం. గ్లోబల్‌ అవుట్‌ ప్లేస్‌మెంట్‌ అండ్‌ కెరీర్‌ ట్రాన్సిషనింగ్‌ ఫర్మ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 965 కంపెనీలు 1.50 లక్షల మందిని ఇళ్లకు పంపాయి. 'లే ఆఫ్స్‌.ఎఫ్‌వైఐ' డేటా బేస్‌ ప్రకారం గత నవంబర్‌ నుండి ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలను పోయాయి. 2023లో కూడా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. జనవరి నెలలో రోజుకు సగటున 3 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని అంచనా! 23వ తేది వరకు 166 ఐటి కంపెనీలు 65 వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించాయి. అనేక చిన్నాచితక కంపెనీలతో పాటు అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ ఐటి సంస్థలు కూడా ఉద్యోగులను సాగనంపే ప్రక్రియలో పోటీ పడుతుండటం విచారకరం. వీటిలో కొన్ని సంస్థలు ముందస్తు నోటీస్‌తో పాటు, కొంత మేరకు పరిహారం ఇస్తుండగా మరికొన్ని సంస్థలు అటువంటివేమి లేకుండానే లే ఆఫ్‌ కాగితాన్ని చేతుల్లో పెడుతున్నాయి. వర్క్‌ ఫ్రం హోమ్‌లో భాగంగా ఇళ్ల దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని అత్యవసర సమావేశం పేరుతో ఆఫీసుకు పిలిచి మరీ చావుకబురు చెప్పిన అమానవీయ ఘనతను అమెజాన్‌ దక్కించుకుంది.
        గత ఏడాది కాలంలో భారతదేశంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న టెకీల సంఖ్య 22 వేల దాకా ఉంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీలు తొలగించిన వారిలో 40 శాతం మంది భారతీయులే అని వివిధ సంస్థలు తేల్చి చెబుతున్నాయి. రానున్న రోజుల్లో కోల్పోయే ఉద్యోగాల్లోనూ భారతీయులే అధికంగా ఉంటారని కూడా ఆ సంస్థలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు పోగొట్టుకున్న భారతీయ యువత పరిస్థితి గందరగోళంగా మారింది. దీనికితోడు హెచ్‌1బి వీసాల నిబంధనలు వారి పరిస్థితిని మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. 60 రోజుల్లో వేరే ఉద్యోగం చూసుకోవాలని లేని పక్షంలో స్వదేశానికి వెళ్లిపోవాలని ఈ నిబంధన పేర్కొంటోంది. దీంతో వేలాదిమంది భారతీయ యువతీయువకులు దేశం కానీ దేశంలో ఉద్యోగాల వేటలో మునిగిపోయారు. మహా ఆర్థిక సంక్షోభంగా చరిత్ర కెక్కిన 2008-09 సంవత్సరాలనాటి కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా 60 వేల మందిని టెక్‌ కంపెనీలు తొలగించాయి. తాజాగా తొలగింపుల జాబితా అంతకు రెండింతల కన్నా ఎక్కువకు చేరింది. మరోవైపు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థికమాంద్యం ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చే అవకాశం లేదని నిపుణుల అంచనా! ఈ నేపథ్యంలో కొత్త ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
        ఈ పరిస్థితులు దేశంలో ఉన్న వారి తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో భారతీయ యువత విదేశాలలో రోడ్డున పడుతున్నా ఇంతవరకు ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించకపోవడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో డిసెంబర్‌ 23వ తేదిన టెక్‌ కంపెనీల్లో లే ఆఫ్‌ల గురించి అడిగిన ఒక ప్రశ్నకు పారిశ్రామిక వివాదాల చట్టం (1947)ను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. దేశంలో ఉద్యోగాలను కోల్పోయిన 22 వేల మందిలో ఏ ఒక్కరికి కూడా ఈ చట్టం వర్తింపచేయలేదు. సంస్కరణల పేరుతో ఉన్న చట్టాలను నీరుగారుస్తూ మరోవైపు వాటినే జపించినందువల్ల ప్రయోజనం ఏమిటి? కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయ యువతకు భరోసా కలిగించే చర్యలు చేపట్టాలి. అక్కడి ప్రభుత్వాలతో సంప్రదించి, నిబంధనల్లో మార్పులు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. దేశీయంగానూ కార్మిక చట్టాలను టెక్‌ కంపెనీలు అమలు చేసేలా కఠిన చర్యలు చేపట్టాలి.