Oct 01,2022 10:46

(నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం)

వృద్ధాప్యం మానవ జీవితంలో చివరి దశ. మనిషి శరీరం రోగనిరోధక శక్తిని క్రమంగా కోల్పోయి చివరకు మరణించే స్థితికి చేరే దశ. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది వృద్ధులు తమ పని తాము చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రకరకాల కార్యకలాపాల్లో పాల్గొని చైతన్యవంతులు అవుతున్నారు. 50-60 ఏళ్లలో జరిగే శరీరమార్పులను సైతం ఎదుర్కొని నిలబడుతున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పరిశోధనలు తేల్చాయి. నిజంగా వృద్ధాప్యంలో అనేక సమస్యలు బాధిస్తాయి. చర్మం ముడతలు పడిపోతుంది. వినికిడి సమస్య, కంటిచూపు తగ్గుతుంది. స్పష్టమైన ఆలోచన ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. బిపి, షుగరు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. కానీ కొంతమంది వీటన్నింటిని తట్టుకుంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా వృద్ధులు నిలబడుతున్నారని రాబర్టు అనే శాస్త్రవేత్త తేల్చారు. మరి వృద్ధులు ఎలా చురుకుగా ఉంటున్నారు? అందుకు వారి జీవితం ఏ మార్పులు చేసుకున్నారో ఆయన పరిశోధనలో చెప్పారు.

If-active-old-age-is-far-away


        వృద్ధులు 60 ఏళ్ల తర్వాత కూడా చాలా చురుకుగా ఉంటున్నారని, వీరి సగటు జీవిత కాలం పెరిగిందని డెమెగ్రఫీ (సైన్సు ఆఫ్‌ పాపులేషన్‌) ఓ సర్వేలో తేల్చింది. 60 ఏళ్ల తర్వాత వృద్ధులను యంగ్‌ ఓల్డ్‌, ఓల్డ్‌ ఓల్డ్‌ అనే రెండుగా వర్గీకరించింది. 60-80 మధ్య వయస్సు వాళ్లను యంగ్‌ ఓల్డ్‌ అని, 80 ఏళ్లు దాటిన వారిని వృద్ధులని చెబుతుంది.

                                                                  మెదడుపై పరిశోధనలు

డబ్ల్యుఎంకె చెందిన ట్రినిటి కాలేజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్సుకు చెందిన శాస్త్రవేత్త ఈయాన్‌ రాబర్ట్స్‌ అసలు మనిషికి వృద్ధాప్యం ఎప్పుడు వస్తోందో తెలుసుకునేందుకు పరిశోధనలు చేశారు. 1984 నుంచి ఆయన మానవుని మేథస్సు (మెదడు) మీద ఇతోధికంగా పరిశోధనలు జరిపారు. మెదడులో జరుగతున్న చర్యల్లో భాగంగా మొదట బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిన రోగుల సగటు వయసు తీశారు. అప్పుడు 72 వయస్సు ఉన్నట్లు తేలింది. 1999లో 82 ఏళ్లు ఉన్నట్లు ఆ మెదడు పనితీరు మారింది. అంటే చురుకుదనం 10 ఏళ్లు పెరిగింది. దాంతో 80 ఏళ్ల వరకు మనిషికి వృద్ధాప్యం రాదు అని బయోలాజికల్‌, సైకాలజీకల్‌గా ఆయన పరిశోధనలో తేల్చారు. మనిషి మెదడు ప్లాస్టిక్‌ లాంటిదని, దీన్ని ఉపయోగించే కొద్ది దీని సామర్థ్యం, స్వభావం, పనితీరు, స్వరూపం పెరుగుతుందని, నిరంతరం మారుతూ ఉంటుందని పరిశోధనలో చెప్పారు. ఈ మెదడు పనితీరు మారే క్రమాన్ని ఈ విధంగా రాబర్ట్స్‌ చూశారంటే.. ఆ మనిషి ఆలోచనలు, తాను నేర్చుకునే పని మీద, తెలుసుకున్న అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు అంశాల మీద ఆధారపడి మనిషి వృద్ధాప్య దశ ఉంటుంది. ఈ మూడు చర్యలు బాగుంటే మనిషి చాలా సంవత్సరాలు చురుకుగా ఉంటాడు.
 

                                                    చురుకుగా ఉండాలంటే ఏం చేయాలి ?

50 ఏళ్ల తర్వాత దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే మెదడు-వృద్ధాప్యాన్ని దూరంగా పెడుతుందని రాబర్టు అంటున్నారు. అవి ఏమిటంటే ...
1. వ్యాయామం : శారీరక వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తున్న వారిలో మెదడు పని తీరు చురుకుగా ఉంటున్నట్లు గ్రహించారు. వాకింగ్‌, రన్నింగ్‌, జిమ్‌, యోగా వంటి శారీర శ్రమకు చెందినవే అయినా మెదడును కూడా నిర్దేశిస్తాయి. అందుకే నిరంతరం వ్యాయామం చేయాలి.
2. మంచి ఆలోచనలు : దిగులు, విచారం వ్యక్తం చేస్తూ ఉండకుండా మంచి (పాజిటివ్‌)గా ఆలోచనలు చేస్తూ ఉంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఒక సమస్య వస్తే పాజిటివ్‌ థింకింగ్‌లో ఉండాలి తప్ప బాధను వ్యక్తం చేస్తూ ఉంటే మెదడు త్వరగా అలసిపోతుంది.
3. అధ్యయనం : శరీరంలో ఏ అవయవమైనా ఉపయోగించడం మానేస్తే అది పని చేయడం మానేస్తుంది. అందుకే నిరంతరం మెదడుకు కొత్త విషయాలు తెలిసేలా అధ్యయనం చేస్తూ ఉండాలి. నేర్చుకోవాలన్న ఆసక్తి పెరిగేకొద్ది మెదడు ఉత్సాహంతో శరీరానికి సహకరిస్తూ శక్తి సామర్థ్యాన్ని ఇస్తుంది. దీనివల్ల మెదడుపై పాజిటివ్‌ సైకలాజికల్‌ ప్రభావం పడుతుంది. దాంతో వృద్ధాప్యం దరిచేరదు.
4. ఒత్తిడి తగ్గించుకోవడం : ఒత్తిడి అనేది మెదడుకు పెద్ద శత్రువు. దీన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అని అధ్యయనాలు తేల్చాయి. జ్ఞాపకశక్తి తగ్గటానికి కూడా ఒత్తిడే కారణం. ఎక్కువ కాలం ఒత్తిడికి గురయితే మెదడుపై ప్రభావం చూపి చిన్న వయస్సులోనే వృద్ధాప్యంలోకి జారిపోతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి.
5. ఆహార అలవాట్లు : కూరగాయలు, పాలు, సీజన్‌లో వచ్చే పండ్లు, చేపలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు మెదడుకు మంచి సంకేతాలు ఇచ్చేలా సహకరిస్తాయి.
6. సోషల్‌ లైఫ్‌ : ఎవరైతే ఎక్కువగా జనంలో ఉంటూ జీవనం గడుపుతారో వారి మెదడు చాలా బాగుంటుందని పరిశోధనలో తేలింది. అందుకే ఇతరులతో స్నేహ సంబంధాలు కొనసాగించడం చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళ్లడం, పండగలు వేళ అందరినీ కలవడం చేస్తూ ఉండాలి.
7. థింక్‌ యంగ్‌ : 'నేను ముసలివాడిని అయ్యాను. ఈ వయస్సులో ఏ పని చేయలేను. ఎప్పుడు ఏం అవుతుందో' అని వయస్సు మీద పడుతున్న వారు అనుకుంటూ ఉంటారు. దీని వల్ల మెదడు ఒత్తిడికి లోనై రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. అందుకే ఈ ఆలోచన అసలు రానివ్వకూడదు. నిత్యం చురుకైన ఆలోచనలతో ఉండాలి.
ఈ ఏడు సూచనలూ కచ్చితంగా పాటిస్తే 80, 85 ఏళ్ల దాకా చురుగ్గా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.