Oct 05,2022 20:35

గుడ్లవల్లేరు: రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయని, అందుకే సిఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మూడు రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కాంక్షిస్తూ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే ముఖ్యమంత్రి జగన్‌ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు, ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. కులాలు, పార్టీల కోసమో కాక, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదనే సీఎం జగన్‌ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యామని, శ్రమంతా అమరావతికే పెడితే తిరిగి అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కొడాలి నాని అన్నారు.