Aug 19,2022 07:22

మార్రిపల్లి చాలా అందమైన గ్రామం. పంటలకు కొదవ లేదు. అక్కడి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం వారు ఓ క్విజ్‌పోటీ నిర్వహించారు. ఆ పోటీలో సునీల్‌ ప్రథమ స్థానంలో నిలిచాడు. గెలుపొందిన విద్యార్థి ఒకరోజు ఆ గ్రామానికి సర్వోన్నత అధికారిగా పనిచేయవచ్చని ముందుగానే ప్రకటించారు. అలా సునీల్‌ ఒకరోజు గ్రామ అధికారిగా నియమించబడ్డాడు. అతను ఆమోదం తెలిపిన పనులకు జిల్లా కలెక్టర్‌ అనుమతులు మంజూరు చేస్తారని కూడా ప్రకటనలో ఉంది. ఈ విషయం తెలిసిన సునీల్‌ తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ఎంతగానో సంతోషించారు. అయితే సునీల్‌ చిన్నవాడు కదా ఏ నిర్ణయం తీసుకుంటాడా అన్న దానిపైనే అందరి దృష్టి ఉంది.
పెద్దలు ఇలా ఆలోచిస్తుండగానే.. సునీల్‌ కార్యాలయంలోకి అడుగుపెట్టాడు. ఒక సీనియర్‌ అధికారిని పిలిచి, తాను అనుకున్న పని మంజూరు చేయవలసిందిగా కలెక్టర్‌ గారికి ఒక లేఖ రాయమన్నాడు. దానిని ఒక సీల్డ్‌ కవర్లో ఉంచి జిల్లా కేంద్రానికి పంపించారు. అది చూసిన కలెక్టర్‌ వెంటనే అనుమతి మంజూరు చేసి పని ప్రారంభించమన్నారు. వెంటనే అధికారులు గ్రామం నడి ఒడ్డున ఉన్న సారా దుకాణం దగ్గరకి చేరుకొని దానిని మూయించారు. కొద్ది రోజులకు అక్కడ పూల చెట్లు, పండ్ల మొక్కలతో ఉద్యాన వనాన్ని తయారు చేశారు. ఈ పని చేసిన సునీల్‌ను పిల్లాడైనా నువ్వు పెద్దాడివే అంటూ అందరూ అభినందనలతో ముంచెత్తారు.
- సింగంపల్లి శేష సాయి కుమార్‌