
ఝార్ఖండ్ : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదానికి గురయ్యే వార్తలు తరచూ వింటూనే ఉంటాం. అసలు మద్యం తాగినవాళ్లు వాహనాన్ని నడపాలని చూస్తే.. ఆ బండి ససేమిరా.. అంటూ మొండికేస్తే.. ఇదేమిటీ ? మనిషి మద్యం తాగితే వాహనం మొండికేయడమేంటి ? అనుకుంటున్నారా..! అవునండీ.. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ముగ్గురు ఇంజినీర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వాహనం స్టార్ట్ అవకుండా చేసే ప్రత్యేక పరికరానికి ప్రాణం పోశారు.
ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది..! అన్నట్లు కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న అజిత్ యాదవ్‌కు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. బొగ్గు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు.. తరచూ మద్యం సేవించి ప్రమాదాలకు గురవడాన్ని చూసి అజిత్ యాదవ్ ఈ పరికరాన్ని తయారుచేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు... వెంటనే తన స్నేహితులైన మనీశ్, సిద్ధార్థ్‌లతో కలిసి పని మొదలుపెట్టేశాడు. స్నేహితులు, అజిత్ యాదవ్ కలిసి వాహనాల్లో మద్యాన్ని పసిగట్టే భద్రతా వ్యవస్థను రూపొందించారు. అనుకున్నది సాధించారు.
ఇలా సిగ్నల్ అందుతుంది.. వెంటనే ఆగిపోతుంది..
ఆల్కహాల్ సెన్సర్ ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుందని అజిత్ యాదవ్ తెలిపారు. డ్రైవర్ మద్యం తాగాడో ? లేదో ? అనే విషయాన్ని ఈ పరికరం వెంటనే గుర్తిస్తుంది. డ్రైవర్ శ్వాసను పసిగట్టి సెన్సర్‌కు ఆ సమాచారాన్ని పంపుతుంది. ఆల్కహాల్ ఆనవాళ్లు ఉంటే పరికరం డిస్ప్లే లో ఆ వివరాలు కనబడతాయి. ఆ తర్వాత బజర్ మోగుతుంది. ఆ సిగల్ ఇంధన పంప్‌నకు చేరగానే సరఫరా నిలిచిపోతుంది. ఆల్కహాల్ సేవించినట్లు తేలితే.. వాహనం స్టార్ట్ అవకుండా అడ్డుకుంటుంది అని అజిత్ యాదవ్ తెలిపారు. ఈ పరికరాన్ని మరింతగా ఉన్నతీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.