Aug 09,2022 21:04

సెప్టెంబర్‌లో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఆందోళనలకు తీర్మానం
ఐక్య పోరాటాలతో ప్రైవేటీకరణను అడ్డుకొంటాం
ప్రజాశక్తి ా గ్రేటర్‌ విశాఖ బ్యూరో :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పతనానికి అదే పునాది అవుతుందని కార్మిక సంఘాల నేతలు ఉద్ఘాటించారు. మంగళవారం విశాఖలోని డాబాగార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం (ఎఎస్‌వికె)లో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం 'కార్మిక సదస్సు' నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడానికి అండగా నిలబడతామని పోర్టు, షిప్‌యార్డు, బిహెచ్‌పివి, బిఎస్‌ఎన్‌ఎల్‌, హెచ్‌పిసిఎల్‌, బ్యాంకులు, నేవల్‌ డాక్‌యార్డు తదితర ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ డి.ఆదినారాయణ అధ్యక్షత వహించిన ఈ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ విశాఖను పోర్టు సిటీ, తర్వాత స్టీల్‌ సిటీగా పిలిచేవారని, ఈ ఆనవాళ్లను బిజెపి వచ్చాక చెరిపేస్తోందన్నారు. పోర్టులోని బెర్తులను, ఆసుపత్రిని పిపిపి పేరుతో ప్రయివేటుకు కట్టబెడుతున్నారని తెలిపారు. విశాఖ ఎయిర్‌ పోర్టు వద్దగల కంటైనర్‌ కార్పొరేషన్‌ను ప్రయివేటుకు అప్పగిస్తున్నారని ఆందోళన చెందారు. రైల్వే ఆస్తులు ధారాదత్తం అయిపోతున్నాయన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లు-2022 అత్యంత ప్రమాదకరమైనదన్నారు. తాజాగా ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రకటించగా దీనిపై సభ్యులు గొడవ చేస్తే స్టాండింగ్‌ కమిటీకి రిఫర్‌ చేశారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రైవేటీకరణపై అన్ని పరిశ్రమల్లోనూ క్యాంపెయిన్‌ నిర్వహించాలని, సెప్టెంబర్‌లో ఒక ఉద్యమంలా అన్ని చోట్లా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఐక్య పోరాటాలతో ప్రైవేటీకరణను అడ్డుకొందామని పిలుపునిచ్చారు. పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల కోసం ఏళ్ల తరబడి అడుగుతుంటే.. .తాజాగా పార్లమెంట్‌లో సెయిల్‌లో కలపడానికి గుర్తింపు సంఘం వాళ్లు కోరారని స్టీల్‌మంత్రి చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. ఇప్పటికే ప్లాంట్‌లోకి అడుగు పెట్టకుండా కేంద్రం నియమించిన కమిటీలను గట్టిగా అడ్డుకుని ఒక్క శాతమూ ప్రయివేటీకరణ కాకుండా చూశామన్నారు. త్యాగాల ఫలితంగా ప్లాంట్‌ ఏర్పడిందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు, సెప్టెంబర్‌లో పరిశ్రమల్లో ఆందోళనల నిర్వహణపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరాం సదస్సులో తీర్మానం ప్రవేశపెట్టగా అందరూ ఆమోదించారు.