Mar 19,2023 13:34

తిరువూరు (ఎన్‌టిఆర్‌) : జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయంగా అందించింది.

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మాట్లాడుతూ ... '' సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్‌లు నచ్చరు.. ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ... చివరికి మంచి చేసిన వారే గెలుస్తారు... ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి ... పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు ... అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు ... '' విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామన్నారు. కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని అన్నారు.

                                       కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే : సిఎం జగన్‌

కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చామని సిఎం జగన్‌ అన్నారు. 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా రూ.1.9 లక్షల కోట్లు అందించామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నామన్నారు. ఏప్రిల్‌ 11న రెండో విడత వసతి దీవెన నిధులు విడుదల చేస్తామని సిఎం ప్రకటించారు. ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. జీఈఆర్‌ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వ బడులు, కార్పొరేట్‌ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నామన్నారు. '' మీ పిల్లల చదువులకు నాది బాధ్యత '' అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నామన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నామన్నారు. రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని సిఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్‌ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తామని సిఎం జగన్‌ పేర్కొన్నారు. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదేనన్నారు.

                          కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే స్వయంగా మాట్లాడతా : సిఎం జగన్‌

గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారనీ, ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదని సిఎం జగన్‌ అన్నారు. లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అరకొరగా ఇచ్చేవాళ్లనీ, ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారనీ అన్నారు. తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయన్నారు. అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నామన్నారు. జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చామన్నారు. 27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చామన్నారు. చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించామని అన్నారు. విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా ఇస్తున్నామన్నారు. తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే తామే స్వయంగా మాట్లాడతామని సిఎం జగన్‌ చెప్పారు.