Jan 24,2023 08:33

ప్రస్తుత కాలంలో గ్రామాల్లో ఉన్న కళాకారులకు ఆదరణ కరువైంది. కాలానుగుణంగా మారుతున్న జనరేషన్‌ అభిరుచులు, పెరిగిన సాంకేతిక విస్తరణ వీరిపై ప్రభావం చూపుతోంది. ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక, బతుకుదెరువు కోసం మరొక పనిలో నిమగమవుతున్నారు. కళల పట్ల ఎంతో ఆసక్తి ఉండటంతో వృద్ధాప్యంలోనూ నేర్చుకున్న విద్యపట్ల ఎంతో తపన, ఆసక్తి కనబరుస్తున్నారు. కాని జనంలో ఆదరణ, ప్రోత్సాహం లేక కళారంగంలో ముందుకు వెళ్లలేకపోతున్నారు.

111గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామానికి చెందిన రాజు(59)కు శిల్పకళ, దృశ్యకళ పెయింటింగ్‌లో నైపుణ్యం ఉంది. ఆర్టిస్టు రాజుగా చుట్టుపక్కల గ్రామాల్లో మంచిపేరు సంపాదించారు. ఒకసారి దేనినైనా, ఎవరినైనా చూశారంటే నిమిషాల్లో బొమ్మ గీసేస్తారు. ఈయన ఐదో తరగతి చదువుకుంటున్న రోజుల్లో పెదనందిపాడులో ఉన్న మేనమామ నూకరాజు ఇంటికి వెళ్లాడు. అక్కడ మామయ్య ఆకులు, పూలు రసాలతో పెయింట్‌ వేయడం చూశారు. దాంతో తానూ గీస్తానని ఉత్సాహం చూపడంతో మామయ్య పెయింటింగ్‌లో ఓనమాలు నేర్పించారు. అప్పట్లో ఆయనకు తెలియదు. అదే తనకు జీవనాధారం అవుతుందని. రాజులో గ్రహింపుశక్తి గుర్తించిన ఆయన కొన్ని నెలలు తన దగ్గరే ఉంచుకుని పెయింటింగ్‌లో మెళకువలు నేర్పించాడు. అప్పటి నుంచి స్కూల్లో సైన్సు బొమ్మలు, దేశాల చిత్రపటాలు అచ్చుగుద్దినట్లు చిత్రించేవారు. వాటిని చూసి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేవారు. 'చిన్న వయసులోనే బొమ్మలు ఇంత అద్భుతంగా గీస్తున్నావు...నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ విద్యను వదులుకోవొద్దు' అని ప్రోత్సహించేవారు. పేద కుటుంబానికి చెందిన ఆయన పదో తరగతి వరకే చదివారు. దాంతో తాను నేర్చుకున్న కళను నమ్మకుని ముందుకు అడుగులు వేశారు. సినీయాక్టర్లు, దేవుళ్లు, దేశ నాయకులు, అందమైన ప్రకృతి దృశ్యాలు, పూలు, పండ్లు, ముగ్గులు గీయడం మొదలు పెట్టారు. పెయింట్‌ చేస్తూనే సంగీతం పట్ల మక్కువ చూపాడు. పాత సినిమా పాటలు వింటూ నిత్యం సాధన చేస్తూ గాయకుడుగానూ ప్రావీణ్యం సంపాదించాడు. దాంతో ' సినీ సంగీత విభవరి'లో గాయకుడుగా చోటు సంపాదించాడు. శుభకార్యాల్లో, సభల్లో ఏర్పాటుచేసిన కచేరిల్లో పాటలు పాడుతూ సంగీతం పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని కనబరిచాడు. ఈయనకు నలుగురు ఆడపిల్లలు. పెయింటింగ్‌ వేయగా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు గడుస్తుంది. పిల్లల్ని అందర్నీ చదివించి, పెళ్లిళ్లూ చేశారు. పది ఏళ్లగా పెయింట్‌ స్థానంలో ప్లెక్సీల హవా నడుస్తోంది. రాజుకు ఆదాయం బాగాó తగ్గింది. దాంతో ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలపై బొమ్మలు గీస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. సంవత్సరంలో కొన్ని నెలలు (సీజన్‌లో) మాత్రమే పని దొరుకుతుంది. కరోనా సమయంలో ఉపాధి లేక ఇల్లు గడవడం కష్టమైంది. ఇప్పుడిప్పుడే పెయింట్‌ ఆర్డర్లు వస్తున్నాయంటున్న రాజు ఆశించిన స్థాయిలో ఆదాయం లేదంటున్నారు.

222


           ఆ వూరికి చెందిన శ్రీనివాసులు(52) కాంటినెంటల్‌ కాఫీ- సిసిఎల్‌ ఫ్యాక్టరీలో కార్మికుడుగా పనిచేస్తున్నారు. బాల్యంలో ఘంటసాల పాటలు వింటూ పెరిగిన ఆయన సంగీతం అంటే ఇష్టం ఏర్పరుచున్నాడు. విన్న ప్రతి పాటా అదే స్థాయిలో పాడేలా సాధన చేసేవాడు. ఒకసారి స్కూల్లో జరిగిన పోటీల్లో పాల్గొని 'తూర్పు వెళ్లే రైలు' సినిమాలో 'చుట్టూ చంగావి చీర....' పాట పాడి ప్రథమ బహుమతి అందుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఘంటసాల, బాలు గారి పాటలు పాడి ఎన్నో బహుమతులు సాధించారు. గురువులేని సంగీత స్వరకర్తగా చుట్టు పక్కల గ్రామాల్లోనూ గుర్తింపు సంపాదించాడు. దాంతో పండగలు, శుభకర్యాలకు వెళ్లి గానం చేసేవారు. ఒకసారి తెనాలిలో జరిగిన 'ఘంటసాల విగ్రాహవిష్కరణ' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాయకుడు బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. అప్పుడు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీనివాసులు 'శంకరాభరణం' చిత్రంలో 'శంకరా...' పాట పాడి మొదటి బహుమతి సాధించారు. అంతేకాదు శ్రీనివాసులు సంగీతం నేర్చుకోకుండా పాట పాడారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. శాలువా కప్పి అభినందించారు. 20 ఏళ్ల నుంచి తమ సోలో పాటలకు ఆదరణ కరువైందని, ఇప్పటి కాలంలో మాస్‌ పాటలకు ఉన్న గుర్తింపు తమ పాత మెలోడి పాటలకు లేదని బాధపడుతున్నాడు.
          కొలకలూరు గ్రామానికి చెందిన గురుమూర్తి (66) తబలా వాయిద్యుకుడు. చిన్నతనంలో ఆ డ్రమ్‌లను చూసి ఇష్టంగా కొనుక్కున్నాడు. ఎలాగైనా తబలా నేర్చుకోవాలని పట్టుబట్టాడు. తెనాలి వెళ్లి శిక్షణ తీసుకున్నారు. హిందుస్థానీ, కర్నాటక సంగీతంలో బేస్‌కోడ్‌, టాప్‌కోర్‌లో సాధన చేశారు. తబలాలో అన్ని రకాల బోల్స్‌ వాయిస్తూ నైపుణ్యం సంపాదించారు. ఈ వాయిద్యంలో టెక్నిక్‌తో మృదంగం కూడా వాయించే ప్రతిభనూ సాధించారు. దాంతో హరిశ్చంద్ర, చింతామణి, బ్రహ్మంగారి నాటకాల్లో, రకరకాల భజన కార్యక్రమల్లో పాల్గొని తన వాయిద్యంతో జనాన్ని మైమరిపించేవారు. మనసుకు బాధగా అనిపించినప్పుడు తబలా వాయిస్తూ కష్టాన్ని మర్చిపోతానంటున్నారు. ఎన్నో బహిరంగ ప్రదర్శనల్లో, నృత్యగీతాల్లో పాల్గొన్న గురుమూర్తి ఎంతో మంది కళాకారుల నుండి అభినందనలు, అవార్డులు అందుకున్నారు. డిగ్రీ వరకూ చదువుకున్న ఈయన పంచాయతీ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశారు. అయినా తబలా వాయిద్యంపై ఉన్న మక్కువ తగ్గలేదు. అవకాశాలు వస్తే ఇంకా ప్రదర్శిస్తానంటున్నారు.
          గురుమూర్తి బంధువు అయిన నాగేశ్వరావు ఫ్లూట్‌ వాయిస్తారు. డిగ్రీ వరకు చదువుకున్న ఈయన ప్రయివేట్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. మేనల్లుడు శివ శంకరావు గాయకుడు. తబలా వాయిస్తారు. వీరంతా ఒక ట్రూప్‌గా కార్యక్రమాలు ఇచ్చేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సంక్రాంతి పండగ సందర్భంలో ఊరిలో జరిగే వేడుక ప్రదర్శనలో పాల్గొని తృప్తి పడుతున్నారు.
        వీరే కాదు చాలా గ్రామాల్లో నాటక, నృత్య, సంగీత కళారంగంలో ప్రతిభ ఉన్నవారు ఉన్నారు. అయితే వారికి తగిన గుర్తింపు ఉండటం లేదు. దాంతో ఉపాధి కోసం వేర్వేరు మార్గాలు వెతుక్కుంటున్నారు. వీరు ఆయా పనుల్లో రాణించలేక తమకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్లలేక అసంతృప్తితో జీవితాలు కొనసాగిస్తున్నారు. వీరిని ప్రభుత్వంతో పాటు ప్రజలు గుర్తించి ఆదరించాలి.
 

- పద్మావతి