
రాయాలనిపిస్తే రాసేయ్ ...
మదమెక్కిన మృగాళ్ళరాక్షసత్వంపై
నానా గడ్డితినే రాజకీయనాయకులపై
రాయాలనిపిస్తే రాసేయ్ ...
గృహ హింస పెట్టే ఖూనీకోరులపై
అవినీతికి పాల్పడే అధికారులపై
రాయాలనిపిస్తే రాసేయ్ ....
భ్రూణహత్యలకు పాల్పడే భ్రష్టులపై
వృద్ధ తల్లిదండ్రులను చూడని త్రాష్టులపై
రాయాలనిపిస్తే రాసేయ్ ....
నమ్మకాన్ని సొమ్ము చేసే చిట్ఫండ్లవాళ్ళపై
రైతుల కష్టాన్ని దోచుకునే దగా దళారులపై
రాయాలనిపిస్తే రాసేయ్ ....
కల్తీ సరుకులమ్మి దోచుకునే వ్యాపారులపై
నోట్లకు కక్కుర్తిపడి ఓట్లమ్మకునే ఓటర్ల పై
రాయాలనిపిస్తే రాసేయ్ ...
ధనాన్ని దోచుకునే కార్పోరేట్ ఆసుపత్రుల పై
తీసుకున్న జీతానికి న్యాయంచేయని ఉద్యోగులపై
రాయాలనిపిస్తే రాసేయ్ ...
కరెన్సీ కోసం న్యాయాన్ని చంపేసే లాయర్లపై
అమ్యామ్యాలకోసం చట్టాన్ని చుట్టేసే పోలీసులపై
రాయాలనిపిస్తే రాసేయ్ ....
దేశసమగ్రతను దెబ్బతీసే ఉగ్రవాద ముష్కరులపై
సుపరిపాలన అందించని ప్రజాపాలకులపై
రాయాలనిపిస్తే రాసేయ్ ....
విద్యను వ్యాపారంచేసే కార్పోరేట్ కళాశాలలపై
ఓర్వలేక బురదచల్లే కుహనాకవులపై
రాయాలనిపిస్తే రాసేయ్ ....
రాసేస్తే పోయేదేమీలేదు
ప్రగతి నిరోధక సంకెళ్ళు తప్ప.
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్ : 9441791239