Jan 24,2023 11:58

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పలలో అక్రమంగా ఇసుక, మట్టి తరలింపు జరుగుతోందని స్థానికంగా పలువురు తెలిపారు. మంగళవారం పలువురు మాట్లాడుతూ .... మండల కేంద్రమైన నార్పలలో సీసీ కెమెరాల సాక్షిగా రాత్రి సమయంలో ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక మట్టిని తరలిస్తున్నారని అన్నారు. గత కొద్దిరోజుల క్రితం మైనింగ్‌ అధికారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్‌ లను జెసిబి లను సీజ్‌ చేసి నామమాత్రంగా జరిమానాలను విధించి వదిలేశారు. అయినా పగలు సమయంలో మట్టి, ఇసుక తరలింపు ఆగిపోయింది, అయితే ఇందులో అధిక ఆదాయానికి అలవాటు పడిన కొందరు అధికారులు, పోలీసుల కళ్లుగప్పి కొందరు రాత్రి 10 గంటల నుండి ట్రాక్టర్లలో మట్టిని ఇసుకను తరలిస్తున్నారు. గూగూడు రోడ్డు లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ లను విజిలెన్స్‌ అధికారులు, మైనింగ్‌ అధికారులు స్థానిక పోలీస్‌ స్టేషన్లో పరిశీలిస్తే రోజుకు ఎన్ని టాక్టర్లు రాత్రి పగలు అన్న తేడా లేకుండా రోజుకు ఇసుక మట్టిని ఎన్ని ట్రిప్పులు తరలిస్తున్నారో తెలిసిపోతుంది. ఒక్కొక్క ట్రాక్టర్‌ కి వెనక ముందు రెండు ద్విచక్ర వాహనాలు సెక్యూరిటీతో పకడ్బందీగా మట్టిని తరలిస్తున్నారు. ఈ మట్టిని ఇసుకను తరలించే ట్రాక్టర్లు, టిప్పర్లు రాత్రి సమయంలో గూగూడు రోడ్డులో అతి వేగంగా వెళుతుండటంతో ఎవరైనా పిల్లలు, వఅద్ధులు బయటికి వస్తే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ముఖ్యంగా రాత్రి సమయంలో గూగూడు రోడ్డులో నివాసముండేవారి చిన్న పిల్లలు రాత్రి సమయంలో రోడ్డు పై పెద్దగా వాహనాల రాకపోకలు ఉండవని సైకిలు తొక్కుతూ ఉంటారని అక్రమంగా మట్టిని ఇసుకను తరలించే వాహనాలు అతివేగంగా వెళుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వాహనాల పై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించకుండా ప్రత్యేక నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.