May 27,2023 08:03

           వివిధ రాష్ట్రాల్లోని సహకార పాల డెయిరీలను మింగేయాలని అమూల్‌ చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిఘటన పెరగడం హర్షణీయం. తమ రాష్ట్రంలో పాల సేకరణను నిలిపివేయాల్సిందిగా అమూల్‌ను ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాయడం స్వాగతించదగినది. తమిళనాడులో అమూల్‌ పాలసేకరణ కార్యకలాపాలవల్ల తమిళనాడు సహకార డెయిరీ అవిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుందన్నది ముమ్మాటికీ నిజం. అమూల్‌ పాల సేకరణ శ్వేత విప్లవ స్ఫూర్తికి విరుద్ధమని.. దేశంలో ప్రస్తుత పాల కొరతను మరింత తీవ్రతరం చేస్తుందని, వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న స్టాలిన్‌ ఆక్షేపణ కాదనలేనిది. అవిన్‌ గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు నాలుగు లక్షల మందికి పైగా సభ్యుల నుండి రోజుకు 35 లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. పాల ఉత్పత్తిదారులకు లాభదాయకమైన ధరలు చెల్లిస్తోంది. అమూల్‌ చర్య దశాబ్దాలుగా నిజమైన సహకార స్ఫూర్తితో నడుస్తున్న అవిన్‌ మిల్క్‌షెడ్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే.
           కొత్తగా కేంద్రంలో సష్టించిన సహకార మంత్రిత్వశాఖకు ఇన్‌ఛార్జిగా ఉన్న హోం మంత్రి అమిత్‌షా కర్ణాటకలోని మాండ్యాలో పర్యటిస్తూ గుజరాత్‌కు చెందిన కోఆపరేటివ్‌ డెయిరీ అమూల్‌లో కర్ణాటక రాష్ట్ర సహకార డెయిరీ నందినిని విలీనం చేయాలని అన్నారు. ఈ ప్రకటనపై కర్ణాటకలో రైతులే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అమూల్‌లో నందినిని విలీనం చేయడం, లేదంటే కర్ణాటకలో నందినికి సమాంతరంగా అమూల్‌ నెట్‌వర్క్‌ను చొప్పించడం ద్వారా స్థానికంగా నందినిని ధ్వంసం చేయాలని కేంద్రం నిశ్చయించుకుందని కర్ణాటక ప్రజలు గట్టిగా నమ్మారు. ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. ఒక సహకార సంస్థను మరొక సహకార సంస్థ కబళించడం సహకార స్ఫూర్తికి విరుద్ధం.
       భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ ప్రకారం సహకార సంస్థలు రాష్ట్రాల జాబితాలోవి. 2021 వరకు సహకార విభాగం వ్యవసాయ మంత్రిత్వశాఖలో ఒక చిన్న విభాగం. అకస్మాత్తుగా సహకార విభాగాన్ని స్వతంత్ర మంత్రిత్వశాఖ స్థాయికి పెంచి అమిత్‌షాకు ఆ బాధ్యతనిచ్చింది. కేంద్రం నియంత్రణ కిందికి సహకార వ్యవస్థను తీసుకొచ్చే ప్రక్రియ మొదలు పెట్టింది. బహుళ రాష్ట్ర సహకార సంఘాల (ఎంఎస్‌సిఎస్‌) బిల్లు తెచ్చింది. ఎంఎస్‌సిఎస్‌ రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది. పాల సహకార రంగాన్ని కార్పొరేటీకరించడం ద్వారా ప్రపంచ పాల మార్కెట్‌లో చేరేందుకు మూడు ఎగుమతి ఆధారిత మల్టీ స్టేట్‌ మిల్క్‌ సొసైటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఎగుమతులను ప్రోత్సహించేందుకు పని చేస్తాయని ఈ ఏడాది జనవరి 11న ప్రధాని ప్రకటించారు. మార్చి 10న ఇండియన్‌ డెయిరీ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రెండు లక్షల పంచాయతీలలో స్వతంత్ర పాల సొసైటీలను ఏర్పాటు చేస్తామని, ఇవి అమూల్‌ నేతత్వంలోని ఎగుమతి ఆధారిత సొసైటీతో ముడిపడి ఉంటాయన్నారు. ఇది కేవలం అమూల్‌-నందినికే పరిమితం కాదు. పాల సహకార సంస్థలను కార్పొరేట్లు స్వాధీనం చేసుకునే కేంద్రీకరణ. భవిష్యత్తులో మొత్తం పాల ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రక్షణ ఉండదు. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామీణ భారతాన్ని మరింత అతలాకుతలం చేస్తుంది. పాల రంగం పల్లె కుటుంబాలను కొంత వరకు నిలబెట్టగా కార్పొరేటీకరణ ఆ ఆసరానూ తొలగిస్తుంది. ఇది దేశంలో గల పది కోట్ల మంది రైతులను దెబ్బతీస్తుంది. కాబట్టే తమిళనాడు సిఎం వ్యతిరేకిస్తున్నారు. కాని, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బాగా నడుస్తున్న సహకార డెయిరీలను దెబ్బ తీసేలా రాష్ట్ర ప్రభుత్వమే అమూల్‌ ను ముందుకు తీసుకురావడం తగదు. పాల రైతుల ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత. కేరళ రాష్ట్ర సహకార డెయిరీ పాలు నాణ్యతలో అత్యుత్తమమైనవని ఇటీవల కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ఆయా రాష్ట్రాల డెయిరీలను, పాల రైతులను మాత్రమేగాక సహకార స్ఫూర్తిని, ఫెడరల్‌ వ్యవస్థనూ కాపాడుకోవాలి. అందుకు మోడీ సర్కారు నిరంకుశ చర్యలను ప్రతిఘటించక తప్పదు.