Sep 22,2022 21:15

23ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ కైవసం
కాంటర్బరీ:
రెండో వన్డే భారత మహిళలజట్టు 88పరుగుల తేడాతో గెలిచి 23ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 1999లో తొలిసారి భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో భారత్‌ నిర్దేశించిన 334పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ జట్టు 44.2ఓవర్లలో 245పరుగులకు ఆలౌటైంది. వాట్‌(68), క్యాప్సీ(39), అమీ జోన్స్‌(39) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. రేణుకా సింఫ్‌ుకు నాలుగు, హేమలతకు రెండు, షెఫాలీకి ఒక వికెట్‌ లభించాయి. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హర్మన్‌ప్రీత్‌కు లభించగా.. మూడు వన్డే శనివారం జరగనుంది. ఐసిసి ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ ఆడుతోంది.
హర్మన్‌పై ప్రశంసల జల్లు..
టీమిండియా సిరీస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(143నాటౌట్‌)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి వన్డేలోనూ 74 పరుగులతో అజేయంగా నిలిచిన హర్మన్‌.. రెండు వన్డేలో ఏకంగా శతకం కొట్టింది. దీంతో హర్మన్‌ను టీమిండియా మాజీ ఆటగాళ్లు సహా పలువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ఆమె చివరి 11బంతుల్లో (6, 4, 4, 6, 4, 1, 6, 4, 4, 4, 0) 43 పరుగులు రాబట్టిందని ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు.
''కీలకమైన మ్యాచ్‌లో సూపర్‌గా ఆడావు. ఫామ్‌లో ఉంటే ఎంత ధాటిగా ఆడతావో తెలిపావు. సెంచరీ చేసినందుకు అభినందనలు. అలాగే సుదీర్ఘకాలం తర్వాత సిరీస్‌ను గెలవడం ప్రశంసనీయం'' - వసీం జాఫర్‌
''అద్భుతమైన ఇన్నింగ్స్‌. 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లలతో అజేయంగా 143 పరుగులు చేసిన హర్మన్‌కు అభినందనలు. ఇలాగే కొనసాగాలి'' - అమిత్‌ మిశ్రా
''హర్మన్‌ ప్రీత్‌ థోర్‌' - రాజస్థాన్‌ ఫ్రాంచైజీ