May 28,2023 11:32
  • చైనాపై ఏర్పాటైన అమెరికన్‌ హౌస్‌ కమిటీ సిఫారసు
  • త్వరలో మోడీ అమెరికా పర్యటన

వాషింగ్టన్‌ : అమెరికా తన ప్రపంచాధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగంగా భారత్‌ను నాటో కూటమిలోకి లాగేందుకు రంగం సిద్ధం చేసింది. చైనా ప్రాబల్యాన్ని అరికట్టి, దానిని దెబ్బతీయడమే లక్ష్యంగా నాటో స్లస్‌ 5 గ్రూపులోకి భారత్‌ ను చేర్చుకోవాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ హౌస్‌ సెలక్టు కమిటీ సిఫారసు చేసింది. అమెరికన్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ మెక్‌ కార్దీ గత జవనరిలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ తన తొలి నివేదికను శుక్రవారం నాడిక్కడ విడుదల జేసింది. అమెరికా ప్రపంచాధిపత్య వ్యూహంలో ప్రధాన సాధనంగా ఉన్న నాటో కూటమిలో ఉత్తర అట్లాంటిక్‌ ప్రాంత దేశాలతోబాటు తూర్పు యూరపు దేశాలు కలిపి మొత్తం 31 సభ్య దేశాలు ఉన్నాయి. దీనికి అనుబంధంగా (నాటో ప్లస్‌) పేరుతో మరో అయిదు దేశాలను చేర్చుకుంది. . అవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, ఇజ్రాయిల్‌, ద.కొరియా. ఇప్పుడు వీటికి భారత్‌ అదనంగా తోడవుతుందన్నమాట. ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉన్న చైనాను, దానికి నాయకత్వం వహిస్తున్న చైనా కమ్యూనిస్టు పార్టీని దెబ్బ తీయడమే లక్ష్యంగా అమెరికా రకరకాల పన్నాగాలు పన్నుతున్నది. ఇప్పటికే రష్యాను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్‌ యుద్ధాన్ని 15 నెలలుగా రాజేస్తున్నది. తన ఆధిపత్యానికి గట్టి సవాల్‌ విసురుతున్న రష్యా, చైనాలపైనే అమెరికా గురి పెట్టింది. ఇందుకనుగుణంగా జనాభాపరంగా ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన భారత్‌ను తన విష కౌగిలిలో బిగించేందుకు ప్రయత్నిస్తున్నది. భారత్‌లోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ దానికి జూనియర్‌ భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడానికి ముందే అమెరికన్‌ కాంగ్రెస్‌ హౌస్‌ సెలక్టు కమిటీ ఈ నివేదికను విడుదల చేయడం గమనార్హం. ఇప్పటికే ఇండో పసిఫిక్‌ సెంట్రిక్‌ గ్రూపు, కావ్వడ్‌, ఇతర పొత్తులు, భాగస్వామ్యాల పేరుతో భారత్‌ను తన భద్రతా చట్రంలో ఇరికిస్తున్న అమెరికా ఇప్పుడు నాటో ప్లస్‌లో చోటు కల్పించడం ద్వారా చైనా చుట్టూ తన సైనిక ఉచ్చు బిగించాలని చూస్తోంది, చైనాలో అంతర్భాగమైన తైవాన్‌లో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తున్నది. చైనా నుంచి తైవాన్‌ను వేరు చేయడానికి అవసరమైతే తన రక్షణ బలగాలను ఈ ద్వీప ప్రాంతానికి పంపుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ మధ్య పదే పదే ప్రకటిస్తున్నారు. జి-7, నాటో, క్వాడ్‌ అన్నీ కలిస్తే అత్యంత ప్రభావం చూపుతాయని, ఈ విషయాన్ని బహిరంగంగా ప్రచారం చేయడం ద్వారా చైనాను హెచ్చరించడమే కాదు, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభావానికి అడ్డుకట్ట వేయొచ్చని హౌస్‌ కమిటీ పేర్కొంది. అంతేకాదు, రష్యా, చైనాలకు వ్యతిరేకంగా విధించే ఆంక్షలు మెరుగ్గా పనిచేయడానికి భారత్‌ను నాటోలో చేర్చడం అవసరమని ఆ కమిటీ పేర్కొంది. కొన్నాళ్ల క్రితం భారత్‌ను నాటో ప్లస్‌ గ్రూపులోకి చేర్చుకోవాలంటూ ఒక బిల్లును అమెరికన్‌ కాంగ్రెస్‌కు చెందిన డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు రో ఖన్నా ఓ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ పరిస్థితుల్లో భారత ప్రధాని మోడీ వచ్చే నెల 21 నుంచి నాలుగు రోజులపాటు అమెరికాలో జరపతలపెట్టిన పర్యటన ఈ ఎజెండా కోసమేనా ?