
- అదాని ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేయాలి
- కోల్‌కతా బహిరంగ సభలో సీతారాం ఏచూరి
- తొమ్మిది ప్రాంతాల నుండి ప్రజాప్రదర్శనలు
కోల్‌కత్తా : కార్పొరేట్ మతోన్మాద రాజకీయాలతో ప్రజలను విఛ్చినం చేస్తున్న బిజెపి ఓటమితోనే బెటర్ ఇండియా సాధ్యమవుతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజల సొత్తును లూటీ చేసిన అదానీ తాలుకు ఆస్తులను కేంద్ర ప్రభుత్వం తక్షణం సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా సోమవారం సాయంత్రం కోల్‌కతాలోని రాణి రస్మణీ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. పెద్ద సంఖ్య లో ప్రజానీకం తరలిరావడంతో బహిరంగ సభ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. అంతకుముందు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి తొమ్మిది ప్రజా ప్రదర్శనలు నిర్వహించారు. ఎర్రజెండాలు చేతపట్టి ఒక్కో ర్యాలీలో వేలాదిమంది ప్రజలు భాగస్వాములయ్యారు. కొల్‌కతా నగరం ఎరుపెక్కింది. తొలి పొలిట్‌బ్యూరోలోని తొమ్మిది మంది నాయకులపేర్లతో వివివిడిగా ప్రారంభమైన ఈ ప్రదర్శనలో 'నవరత్న' ర్యాలీగా ఏకమై బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నాయి . అప్పటికే ప్రాంగణం ప్రజానీకంతో నిండిపోయింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాంగణం బయటే నిలిచిపోయారు. ఈ సభలో ఏచూరి మాట్లాడుతూ అదానీ అక్రమాలను ప్రస్తావించారు. గతంలోనూ దేశంలో అవినీతి సంఘటనలు చోటుచేసుకున్నాయి కానీ, ఈ స్థాయిలో ప్రజాధనాన్ని లూటీ చేయడం ఇదే మొదటి సారని అన్నారు. అదాని అక్రమాలతో ఎల్‌ఐసితో పాటు అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రమాదంలో పడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్దిఉన్నా ప్రజల కష్టార్జితాన్ని కాపాడేందుకు పోర్టులు, ఎయిర్‌పోర్టులు వంటి అదాని ఆస్తులను తక్షణం సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. ఎర్రజెండా, వామపక్షాలు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను, మైనార్టీ ప్రజల హక్కులను కాపాడ గలవని అన్నారు.
బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ బిజెపితో పోరాటాన్ని మానుకుందని, పార్లమెంటులో కూడా ఆ పార్టీ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్య దర్శి మహమ్మద్ సలీమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తృణమూల్, బిజెపిలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఏకమవుతున్నారని అన్నారు. ఈ సమావేశానికి సిపిఎం నేత కలోల్ మజూందార్ అధ్యక్షత వహించారు.