
ఇంటర్నెట్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా అటవీ నిర్మూలన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. బ్రెజిల్ మొదటి స్థానంలో నిలిస్తే.. భారత్ తరువాతి స్థానంలో నిలిచినట్లు తాజాగా యుటిలిటి బిడ్డర్ అనే నివేదిక వెల్లడించింది. భారత్‌లో గత 30 సంవత్సరాలలో ఎన్నడూలేనంతగా అడవుల నరికివేత పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. 1990- 2000 మధ్యకాలంలో భారత్‌లో 384,000 హెక్టార్ల అడవులను కోల్పోగా.. దానికంటే రెట్టింపుగా 2015-2020 మధ్యకాలంలో 668,400 హెక్టార్ల అడవీ నిర్మూలన జరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇక 2015-2020 మధ్య ఐదేళ్లకాలంలో బ్రెజిల్ 2,559,100 హెక్టార్ల అడవుల్ని కోల్పోయినట్లు బిడ్డర్ నివేదిక తెలిపింది.
కాగా, భారత్ మాత్రమే కాకుండా అటవీ నిర్మూలన దేశాల్లో జాంబియా కూడా నిలిచింది. 1990-2020 మధ్యకాలంలో 36,250 హెక్టార్ల అడవులను కోల్పోయిన జాంబియా 2015- 2020 మధ్యకాలంలో 18,710 హెక్టార్ల అటవీ నిర్మూలన జరిగి రెండవ అతిపెద్ద అటవీ నిర్మూలనా దేశాల జాబితాలో భారత్ వరుసలో జాంబియా కూడా నిలిచినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1990-2020ల మధ్యకాలంలో 284,400 హెక్టార్ల తేడాతో అటవీ నిర్మూలనలో భారతదేశం అతిపెద్ద పెరుగుదల చవిచూసినట్లు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండవ దేశంగా భారత్ ఉంది. దీంతో నివాసితుల పెరుగుదలతో భారత్‌లో అడవులను కోల్పోవలసి వచ్చిందని ఈ నివేదిక పేర్కొంది. బ్రెజిల్, భారత్ తర్వాత, పామాయిల్ సాగు కోసం అత్యధిక అడవులను నరికేసి ఇండోనేషియా మూడో స్థానంలో నిలిచిందని ఈ నివేదిక తెలిపింది.