Jan 31,2023 21:50
  • భారత్‌-న్యూజిలాండ్‌ చివరి టి20 నేడు
  • రాత్రి 7.00గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

అహ్మదాబాద్‌: సిరీస్‌ను విజేతను నిర్ణయించే చివరి, మూడో టి20కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. లక్షకు పైగా సీట్ల సామర్థ్యంగల ఈ మైదానంలో జరిగే మూడో టి20ని చేజిక్కించుకొని సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న న్యూజిలాండ్‌ జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కొట్టేయాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విఫలం కాగా.. బ్యాటింగ్‌లోనూ టాప్‌ ఆర్డర్‌ నిరుత్సాహపరిచింది. ఇక రెండో మ్యాచ్‌కు వచ్చేసరికి బౌలింగ్‌లో అదరగొట్టేసిన టీమ్‌ఇండియా.. ఛేదనలో చెమటోడ్చాల్సి వచ్చింది. స్పిన్‌ బౌలింగ్‌కు పిచ్‌ అనుకూలంగా మారడంతో ఆచి తూచి ఆడాల్సిన టాప్‌ ఆర్డర్‌ మళ్లీ తప్పటడుగులతో విఫలమైంది. సిరీస్‌ను తేల్చే మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావతమైతే మాత్రం భారత్‌కు దెబ్బ తగలకమానదు. వచ్చిన అవకాశాలను శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌తోపాటు రాహుల్‌ త్రిపాఠి సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇదే కొనసాగితే రిజర్వ్‌ బెంచ్‌ మీద ఆటగాళ్లు తమ ఛాన్స్‌ కోసం డిమాండ్‌ చేసేందుకు వీలు కలుగుతుంది. కెప్టెన్‌ హార్దిక్‌ బౌలింగ్‌ను తనే ప్రారంభించి.. మిగతా బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించడం అభినందనీయమే. కానీ, బౌలర్లను వినియోగించే తీరు సరిగా ఉండటం లేదనేది మాజీ క్రికెటర్ల అభిప్రాయం. రెండో టి20లో చాహల్‌ను కాదని దీపక్‌ హుడాతో పూర్తి ఓవర్ల కోటాను వేయించడంపై గౌతమ్‌ గంభీర్‌ అసహనం వ్యక్తం చేశాడు. కీలకమైన మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్‌, బౌలింగ్‌ వనరులను సద్వినియోగం చేసుకోని సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
జట్లు(అంచనా)..
ఇండియా: హార్దిక్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, ఇషాన్‌(వికెట్‌ కీపర్‌), త్రిపాఠి, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, సుందర్‌, శిమ్‌ మావి, కుల్దీప్‌, ఉమ్రన్‌/చాహల్‌, ఆర్ష్‌దీప్‌ సింగ్‌.
న్యూజిలాండ్‌: సాంట్నర్‌(కెప్టెన్‌), ఫిన్‌, కాన్వే(వికెట్‌ కీపర్‌), చాప్మన్‌, ఫిలిప్స్‌, మిఛెల్‌, బ్రాస్‌వెల్‌, ఇష్‌ సోథీ, డఫీ, ఫెర్గుసన్‌, టిక్నెర్‌.