Oct 03,2022 22:34
  • నిర్మాణ ఖర్చు రూ.360 కోట్లు అంచనా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన మంత్రి కోసం కొత్త అధికారిక నివాసం నిర్మాణానికి ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. నిర్మాణ ఖర్చును రూ.360 కోట్లు అంచనా వేసింది. ఈ నెల 1న సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సిపిడబ్ల్యుడి) ప్రీ క్వాలిఫికేషన్‌ బిడ్లను ఆహ్వానించింది. ఇది ఈ నెల 14 వరకు కొనసాగుతోంది. ఆ తరువాత క్వాలిఫైయింగ్‌ బిడ్డర్లు తమ ఆర్థిక బిడ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి 21 నెలలు పడుతుందని అంచనా వేసింది. సెంట్రల్‌ విస్టా రీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌లో భాగంగా టెండరింగ్‌ ప్రక్రియలో పాల్గనేందుకు సిపిడబ్ల్యుడి నిర్మాణ సంస్థల నుంచి బిడ్లను కోరింది.
ప్రధాన మంత్రి నివాస సముదాయం రాష్ట్రపతి భవన్‌, సౌత్‌ బ్లాక్‌కు ఆనుకుని డిఆర్‌డిఒ భవనానికి ఎదురుగా దారాషికో రోడ్‌లో ఎ, బి బ్లాకుల్లో ఉంటుందని సిపిడబ్ల్యుడి పేర్కొంది. 'నిర్మాణ సైట్‌ అత్యంత సురక్షితమైన జోన్‌లో ఉంది. ప్రతిపాదిత భవనాలు రీన్‌ఫోర్స్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ ఫ్రేమ్డ్‌ స్ట్రక్చర్‌ బిల్డింగ్‌గా ఉండాలి. ఎ, బి బ్లాక్‌లలో ఉన్న నిర్మాణాలను కొత్త నిర్మాణాన్ని ప్రారంభించే ముందు కూల్చివేయాల్సి ఉంటుంది' అని సిపిడబ్ల్యుడి పేర్కొంది. ఈ కాంప్లెక్స్‌లో ప్రధాన మంత్రి నివాసం, ప్రధాన మంత్రి హోమ్‌ ఆఫీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ ఆఫీస్‌, సేవా సదన్‌, గెస్ట్‌ హౌస్‌, బేస్‌మెంట్‌ పార్కింగ్‌ ఉంటాయి. దాదాపు 21,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంటుందని తెలిపింది. మురుగునీటి శుద్ధి కర్మాగారం, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్‌, 25 వాచ్‌టవర్లు, భద్రతా వ్యవస్థలతో కూడిన నాలుగు ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు ఉంటాయి. సిపిడబ్ల్యుడి జులై 18న రూ.360 కోట్ల ప్రాజెక్ట్‌ కోసం ప్రీ క్వాలిఫికేషన్‌ టెండర్‌ను విడుదల చేసింది. కానీ ఆ రోజు జారీ చేసిన ఉత్తర్వులు ప్రకారం 'పరిపాలన కారణాలను' పేర్కొంటూ జులై 22న దానిని ఉపసంహరించుకుంది. సెంట్రల్‌ విస్టా ప్రాంతాన్ని పునరుద్ధరించే ప్రభుత్వ ప్రణాళికలో కొత్త పార్లమెంటు నిర్మాణం నవంబర్‌లోగా పూర్తి కావాల్సి ఉంది. అన్ని మంత్రిత్వ శాఖలకూ ఉమ్మడి కేంద్ర సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయానికి ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌క్లేవ్‌, ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌ ఉన్నాయి.