Mar 27,2023 22:57
  • జల రవాణాకు ప్రాధాన్యత
  • లోకాస్ట్‌, లోరిస్క్‌ బిజినెస్‌
  • 21 రోజుల్లో అన్ని క్లియరెన్సులు

ప్రజాశక్తి-పిఎంపాలెం, విశాఖపట్నం : రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిగా పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు. తీరం వెంబడి పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంతోపాటు వాటికి అనుకుని ఉన్న 48 వేల ఎకరాల్లో పోర్టు అధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో 2023-27 నూతన పారిశ్రామిక పాలసీని పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ ఆవిష్కరించారు. ఈ విధానంలో భూ కేటాయింపుల, రాయితీలు తదితర అంశాల్లో పారిశ్రామికవేత్తలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. లోకాస్ట్‌, లోరిస్క్‌ బిజినెస్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాన్ని పూర్తిగా పారిశ్రామిక అవసరాలకు కేటాయించనున్నారు. విశాఖ చెన్నై పారిశ్రామిక జోన్లో భాగంగా గతంలోనే ఈ పాలసీని తీసుకొచ్చినప్పటికీ ఇటీవల జరిగిన విశాఖ సమ్మిట్‌ సందర్భంగా మెరుగులు దిద్దారు. నూతన పాలసీలో తీరం వెంబడి పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, వీటిని ఆనుకుని సుమారు 48 వేల ఎకరాలలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు రవాణా వాడకాన్ని తగ్గించి, జల రవాణాను ప్రోత్సహించనున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉండేందుకు వీలుగా 21 రోజుల్లోనే సింగిల్‌ విండో పద్ధతిలో భూముల కేటాయింపుతోపాటు అన్ని రకాల అనుమతులూ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. అనుమతులకు సంబంధించి వైఎస్‌ఆర్‌ ఎపి 1 యాప్‌ను కూడా ప్రారంభించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన 96 క్లియరెన్స్‌లను 21 రోజుల్లోనే మంజూరు చేస్తామని ప్రకటించారు. పారిశ్రామిక వేత్తలు వారికి ఏమి కావాలనే విషయాన్ని యాప్‌లో పొందుపరిస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, ఈ యాప్‌ కేంద్ర స్థానాన్ని విశాఖలోనే పెడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత పాలసీలో ఎక్కువ పరిశ్రమలు, మధ్యస్త పరిశ్రమలు ఉన్న జిల్లాలను వేర్వేరు జోన్లుగా విడగొట్టారు. దానికి అనుగుణంగా రాయితీలూ ప్రకటించారు. ఇటీవల జరిగిన గ్లోబల్‌ సమ్మిట్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మెడికల్‌ డివైజెస్‌ తయారీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ రంగాలలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ముందుకు వచ్చారు. అలాగే డిఫెన్స్‌, ఎరోస్పేస్‌ రంగ్లాలో రూ.15,000 కోట్ల జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 14 రంగాలకు తొలి ప్రాధాన్యతలో అవకాశాలు కల్పించారు.

  • పిపిపి కింద కొత్త పాలసీ

కొత్త పాలసీ ప్రకారం పిపిపి కింద ప్రైవేట్‌ ఎంఎస్‌ఎంఇ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇన్నోవేషన్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు విశాఖలో ఐ స్పేస్‌ పేరుతో ఐకానిక్‌ టవర్‌ను నిర్మించనున్నారు. ముఖ్యంగా వేర్‌హౌసింగ్‌కు పరిశ్రమల హోదా కల్పించారు. రాష్ట్రంలో లోకాస్ట్‌, లోరిస్క్‌ బిజినెస్‌ ప్రధానంగా పాలసీని తీసుకొస్తున్నామని వివరించారు.

  • జల రవాణాకు ప్రాధాన్యత

రాష్ట్రంలో 888 కిలోమీరట్ల మేర ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలోనూ బిల్లు పెట్టింది. నూతన పారిశ్రామిక విధానంలో ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానానికి రాష్ట్ర వేగంగా అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

  • అదానీలకు ఉపయోగం

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, రోడ్డు రవాణా, రైలు మార్గాలన్నిటినీ కేంద్రం అదానీ కంపెనీలకు అప్పగించింది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా వారికి కావాల్సిన మార్కెట్‌ను కల్పించే బాధ్యత కేంద్రం తీసుకుంది. ప్రస్తుత పాలసీలో ప్రభుత్వం కేటాయించాలనుకున్న 48 వేల ఎకరాలూ వారి చేతుల్లోకి వెళ్లే అవకాశాలూ ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.