Aug 05,2022 20:03

-సచివాలయ సిబ్బందిని కార్యాలయంలో ఉంచి తాళం వేసిన బాధితులు
ప్రజాశక్తి- కుక్కునూరు (ఏలూరు జిల్లా) :వరదలకు దెబ్బతిన్న ఇళ్ల సర్వేలో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెం గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. తొలుత సచివాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందిని కార్యాలయంలోనే ఉంచి బయట తాళాలు వేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ ఇటీవల గోదావరి వరదలకు తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురవ్వడంతో కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నామన్నారు. వరద తగ్గాక వచ్చి చూస్తే తమ ఇళ్లు కూలిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నష్టం అంచనాకు జిల్లా కేంద్రం నుండి సర్వే బృందం వచ్చి గ్రామ వలంటీర్ల సహకారంతో సర్వే చేసిందన్నారు. గ్రామంలో మొత్తం 365 ఇళ్లు వరద ముంపునకు గురై పడిపోయాయని తెలిపారు. గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం ఉంచిన జాబితాలో 45 ఇళ్లు మాత్రమే దెబ్బతిన్నట్లు పేర్కొనడం ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కుక్కునూరు సిఐ దుర్గా ప్రసాద్‌, ఎంపిడిఒ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకొని వరద బాధితులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రీసర్వే చేసి బాధితులదరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.