Jun 24,2022 10:15

కర్నాటక : కొంతమంది తమ పెంపుడు కుక్కలను ఎంతో గారాబంగా పెంచుతారు. వాటి పుట్టినరోజు, సీమంతం వంటి వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే కర్నాటకలోని ఓ కొత్త పంచాయతీ సభ్యుడు పాత పంచాయతీ సభ్యులను చూసి ' కుక్కల్లా తిన్నారు ' అని కించపరిచాడు. దీంతో ఆ పాత పంచాయతీ సభ్యుడు నిరసనగా... తన కుక్క పుట్టినరోజు వేడుకను వైభవంగా చేశాడు. ఈ పొలిటికల్‌ వార్‌ వివరాలు ఏంటంటే..!

ఓ సారి కొత్త పంచాయతీ సభ్యుడు తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా మాట్లాడుతూ ... పాత పంచాయతీ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రభుత్వ హయాంలో పాత పంచాయతీ సభ్యులు కుక్కల్లా తిన్నారని కించపరిచాడు. ఈ సభ్యుడి వ్యాఖ్యలకు నిరసనగా ... శివప్ప తన పెంపుడు కుక్కకు వైభవంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాడు.

ఘనంగా ఏర్పాట్లు..
బెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తన పెంపుడు శునకం క్రిష్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని గ్రామంలోని 5 వేలమందిని పిలిచాడు. 100 కిలోల కేక్‌ను కట్‌ చేశాడు. 300 కేజీల మాంసం, 100 కేజీల గుడ్లను అతిథులకు వండిపెట్టారు. శాకాహారులకు 50 కేజీల కూరగాయల భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం పెంపుడు కుక్క క్రిష్‌ను ఘనంగా ఊరేగించారు.