Mar 18,2023 21:02

చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌
బీజింగ్‌ : అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వరుసగా పెంచుతూ పోయిన వడ్డీ రేట్ల వల్ల ఆ దేశంలోని సిలివకాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి)ని కుప్పకూలేలా చేసిందని చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతినిధి పేర్కొన్నారు. శనివారం బీజింగ్‌లో జరిగిన గ్లోబల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫోరమ్‌లో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా డిప్యూటీ గవర్నర్‌ షున్‌ చాంగ్‌నెంగ్‌ మాట్లాడుతూ.. ద్రవ్య విధాన మార్పులు ఎంత వేగంగా ప్రభావితం చూపుతున్నాయే దీన్ని బట్టి తెలుస్తోందన్నారు. కొన్ని ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేటు అస్థిరత వాతావరణంలో తమ బ్యాలెన్స్‌ షీట్‌ అమలు చేయడానికి అలవాటు పడ్డాయని.. ఇలాంటి సమయంలో స్వల్ప కాలంలోనే రేట్లలో పెద్ద హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడాన్ని అవి తట్టుకోలేకపోతున్నాయన్నారు.
''సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ లక్షణాలు వడ్డీ రేట్ల మార్పులకు మరింత సున్నితంగా మారాయి. చివరికి ప్రమాదానికి దారితీశాయి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా, అభివృద్థి చెందిన ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్యోల్బణం స్వల్పకాలంలోనే గణనీయంగా తగ్గుతుందా లేదా అనే దానిపై ఇంకా అనిశ్చితి ఉంది. ధరల కట్టడికి చేపడుతున్న అధిక వడ్డీ రేట్లను కొనసాగించడం ద్వారా బ్యాంకింగ్‌, ఆర్థిక స్థిరమైన కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.'' అని షున్‌ పేర్కొన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న ఎస్‌విబి గతం వారం మూత పడగా.. శుక్రవారం దివాళా పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చివరి సారిగా 2023 ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.5-4.75 శాతానికి చేరింది. ఇది 2007 నాటి గరిష్ట స్థాయి రేటు కావడం గమనార్హం. అమెరికాలో ద్రవ్యోల్బణం కోరలు చాస్తుండటంతో ఫెడ్‌ వరుస వడ్డీ రేట్ల పెంపును చేపడుతోంది.