Jun 02,2023 22:43

- మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులను పర్మినెంట్‌ చేయాలి
- కొనసాగుతున్న జీపు జాతాలు

ప్రజాశక్తి-యంత్రాంగం:మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నేతలు కార్మికులకు పిలుపునిచ్చారు. సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాలు శుక్రవారం మూడోరోజుకు చేరాయి. అన్నమయ్య జిల్లా హిందూపురం నుంచి ప్రారంభమైన జాతా కర్నూలు మీదుగా నంద్యాల జిల్లా బేతంచెర్లలోకి, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభమైన జాతా విశాఖ, అనకాపల్లి మీదుగా కాకినాడ జిల్లా పెద్దాపురంలోకి ప్రవేశించించాయి. జాతాలకు ఆయా మున్సిపాల్టీల్లో మున్సిపల్‌ కార్మికులు, సిఐటియు నాయకులు స్వాగతం పలికారు.
విశాఖ, అనకాపల్లిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తాననిఎన్నికల సమయంలో జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఆరు మాసాలలోనే ఉద్యోగులను, కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని చెప్పి మోసం చేశారని తెలిపారు. లక్ష రూపాయల జీతం ఇచ్చినా.. ఎవరూ చేయలేని పనిని పారిశుధ్య కార్మికులు చేస్తున్నారని అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్‌రెడ్డి నేడు ఆ కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. సుప్రీం ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేసి 010 పద్దు ద్వారా జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 20 తర్వాత రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జాతాలో యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి జ్యోతిబసు పాల్గని మాట్లాడారు.
కర్నూలులో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా అమలు కాలేదని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కార్మికులు సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆయాచోట్ల జాతాకు మున్సిపల్‌ కార్మికులు ఘన స్వాగతం పలికారు.