Jun 24,2022 07:36

టెహరాన్‌ : ఇరాన్‌, రష్యాల మధ్య సమగ్ర సంబంధాలకు వూతం ఇవ్వాలని, తద్వారా ఇరు దేశాలకు లబ్ది చేకూరాలని ఆ రెండు దేశాలు పిలుపిచ్చాయి. ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రితో సమావేశానంతరం ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ఈ మేరకు గురువారం ఒక ప్రకటన చేశారు. అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు, స్వతంత్ర దేశాలకు వ్యతిరేకంగా ఆర్థిక ఏకపక్షవాదాన్ని ప్రతిఘటించేందుకు గానూ సహకారాన్ని, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే సమర్ధవంతమైన మార్గమని రైసి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాస్పియన్‌ సముద్ర ప్రాంతంలోని దేశాల మధ్య సహకారం ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఈ ప్రాంతంలోకి ఏ విదేశీ సైనికబలగాలు రాకుండా నిషేధించాలన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో తాజా పరిణామాల గురించి రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌ వివరించారు. అనంతరం రైసి స్పందిస్తూ సాధ్యమైనంత త్వరలో ఈ ఘర్షణకు స్వస్తి పలకాల్సిన అవసరం వుందన్నారు. అవసరమైతే దౌత్య పరిష్కారం కనుగొనేందుకు సాయపడతామని రైసి చెప్పారు. అమెరికా, నాటో రెచ్చగొట్టే చర్యలే ఈ ఘర్షణకు దారి తీశాయని ఆయన వ్యాఖ్యానించారు.