Oct 03,2022 21:02

టెహ్రాన్‌ : ఇరాన్‌లో భారీ ఎత్తున కొనసాగుతున్న నిరసనలపై ఎట్టకేలకు ఆ దేశ సుప్రీం నాయకులు అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం బహిరంగంగా స్పందించారు. అల్లర్లను ఖండించారు. అమెరికా, ఇజ్రాయిల్‌ కుట్ర కారణంగానే నిరసనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇరాన్‌ పోలీసుల కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమినీ మరణించడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అమినీ మరణాన్ని 'మన హృదయాలు బద్దలయ్యే ఒక విచార సంఘటన'గా ఖమేనీ అభివర్ణించారు. అయితే నిరసనలను మాత్రం ఇరాన్‌ను అస్థిరపరిచేందుకు విదేశీ కుట్రగా ఆరోపించారు. టెహ్రాన్‌లో పోలీసు విద్యార్థుల కేడర్‌తో మాట్లాడుతూ ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఈ అల్లర్లు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి' అని అన్నారు. ఈ అల్లర్లకు అమెరికా, జియోనిస్టు ప్రభుత్వం, వారి ఉద్యోగులు ప్రణాళిక రచించారని స్పష్టంగా చెప్పగలనని తెలిపారు. ఈ అల్లర్లు సాధారణమైనవి కావు, అసాధరణమైనవి పేర్కొన్నారు. నిరసనలు ప్రస్తుతం మూడో వారంలోకి ప్రవేశించిన తరువాత ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరసనలను అణిచివేయడానికి ఇరాన్‌ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంది. ఇంటర్నెట్‌ను నిలిపివేసినా టెహ్రాన్‌తో సహా అనేక ప్రాంతాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.